చేనేత కార్మికుల సంక్షేమం మా బాధ్యత : పొన్నం ప్రభాకర్

చేనేత కార్మికుల సంక్షేమం మా బాధ్యత : పొన్నం ప్రభాకర్
  • గత ప్రభుత్వం కంటే 10 శాతం ఎక్కువ ఆర్డర్లు ఇస్తాం

కరీంనగర్, వెలుగు: సిరిసిల్ల చేనేత కార్మికులకు గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే 10 శాతం ఎక్కువే ఆర్డర్లు ఇస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తాము నాలుగు నెలల్లో చేనేతల జీవితాలను ఆగం చేసిందేమీ లేదని, చేనేత కార్మికుల సంక్షేమం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఉగాది సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన పంచాంగ శ్రవణానికి ఆయన హాజరయ్యారు. 

అనంతరం మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత బకాయిలు బీఆర్ఎస్ సర్కార్ ఎగ్గొట్టినవేనని, బీజేపీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా చేనేత ఉత్పత్తులపై 12 శాతం జీఎస్టీ వేసిందని గుర్తు చేశారు. మొదటి నుంచి చేనేతల సంక్షేమానికి కృషి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ గెలుస్తుందని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని హైకమాండ్‌‌‌‌ ముందు కరీంనగర్ నుంచి పోటీ చేయించాలనుకుందని, అనంతర పరిణామాలు, సామాజిక సమీకరణల నేపథ్యంలో ఆయనను నిజామాబాద్ నుంచి బరిలో దింపారన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామన్నారు.