సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

సీఎం దత్తత గ్రామంలోనూ ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు

కరీంనగర్ జిల్లా : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం చిన్న ముల్కనూర్ లో వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడిన సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి 40 కిలోల బస్తాపై రెండున్నర కిలోలు అదనంగా తరుగు తీస్తున్నారని, అకాల వర్షాలు పడితే పంట మరింత నష్టపోవాల్సి వస్తుందనే కారణంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో అయిష్టంగానే తరుగు తీసేందుకు ఒప్పుకుంటున్నారని చెప్పారు పొన్నం ప్రభాకర్. 

రైస్ మిల్లుకు వెళ్లిన తర్వాత మళ్లీ ప్రతి ట్రాక్టర్ లోడ్ పై మూడు కిలోల కోత విధిస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఒక కిలో ఎక్కువ కోత పెట్టినా సదరు రైస్ మిల్లును సీజ్ చేస్తామని చెప్పిన మంత్రి గంగుల కమలాకర్ ఇక్కడికి వస్తే నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా గ్రామాల్లోని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే వరి ధాన్యం కొనుగోళ్లపై అడిషనల్ కలెక్టర్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదటని, అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఫోన్ చేస్తే అడిషన్ కలెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పైనా విమర్శలు చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోకుండా భాగ్యలక్ష్మీ టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాడని, లేదంటే వేములవాడకు వెళ్లి ఫాజుల్ నగర్ పేరును శ్రీరామ్ నగర్ గా మారుస్తామంటున్నాడని సెటైర్ వేశారు. ముందు రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని పొన్నం ప్రభాకర్ కోరారు.

మరిన్ని వార్తల కోసం..

RRRపై వెనక్కి తగ్గిన జీ5..ఎక్స్ ట్రా మనీ అవసరం లేదు

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది