ప్రతి ఊరికి వస్తా.. ప్రజల బాధలు వింటా : పొన్నం ప్రభాకర్ ​

ప్రతి ఊరికి వస్తా.. ప్రజల బాధలు వింటా  : పొన్నం ప్రభాకర్ ​

హుస్నాబాద్​, వెలుగు : ఎన్నికలప్పుడు ఊరూరా తిరిగి ఓట్లెట్ల అడిగిన్నో సమస్యలపై కూడా అలానే అడిగి పరిష్కరిస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన సోమవారం రాత్రి హుస్నాబాద్​కు వచ్చారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి ఊరికి వచ్చి ప్రజల బాధలు వింటానన్నారు.

ఉదయం హైదరాబాద్​లో ఉంటే సాయంత్రం హుస్నాబాద్​ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. హుస్నాబాద్​ ప్రజలు తనకు రాజకీయంగా పునర్జన్మనిచ్చారని ఈ గడ్డను ఎన్నటికీ మరిచిపోనన్నారు. హుస్నాబాద్​లో మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేస్తామని  ప్రియాంకగాంధీ హామీ ఇచ్చారని, ఆమె మాట ప్రకారం ఇక్కడ కచ్చితంగా కాలేజీ ఏర్పడుతుందన్నారు.

గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, నిర్వాసితుల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలుచేశామన్నారు. మిగితా గ్యారెంటీలను వందరోజుల్లో అమలుచేస్తామన్నారు. ఆయన వెంట కాంగ్రెస్​ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి పవన్​, నాయకులు శివయ్య, మంజులారెడ్డి తదితరులున్నారు.