మేడిగడ్డ బ్రిడ్జి ఘటన: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి బస్సులు ఏర్పాటు చేస్తాం

మేడిగడ్డ బ్రిడ్జి ఘటన: కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనానికి బస్సులు ఏర్పాటు చేస్తాం

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్రిడ్జి కుంగిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించామని ప్రచారం చేసుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను స్వయంగా పరిశీలించడానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని  రైతులు, మేధావులు, జర్నలిస్టులు, కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుని మండలానికి ఒక్క వాహనం చొప్పున రేపు(అక్టోబర్ 25, బుధవారం) కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాళేశ్వరంలోని సమస్యలు, జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. 

గతంలో ప్రాజెక్టు నిర్మాణ సందర్భంగా  విందు వినోదాల కోసం ప్రాజెక్టు సందర్శనకు అనేక మంది ప్రజలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీసుకెళ్లారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రజలకు కాళేళ్వర ప్రాజెక్టు నాణ్యత లోపం, నైపుణ్యత లోపం, ప్రజాధనం వృధా అయినట్లు స్పష్టంగా కనబడుతున్నా దీనిపై విచారణ జరిపించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వెనుకంజ వేస్తుందని మండిపడ్డారు.

ALSO READ:  మేడిగడ్డ డ్యామేజ్ పై పోలీస్ కేసు : కుట్ర కోణంపై విచారణకు కంప్లయింట్

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను తెలంగాణ ప్రజలకు తెలియచేయాలని.. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఈ నిజాలను చూపించాలనే బాధ్యతలో భాగంగా నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన ప్రజలను కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నామని.. ప్రజలు, మేధావులు, యువకులు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు.