గ్రే, గోల్డ్​ టిక్​లూ కేటాయిస్తమన్న మస్క్​

 గ్రే, గోల్డ్​ టిక్​లూ కేటాయిస్తమన్న మస్క్​

వాషింగ్టన్: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ వచ్చే నెల 2 నుంచి వెరిఫికేషన్ ప్రక్రియను మళ్లీ ప్రారంభించనుంది. ఫేక్ అకౌంట్ల కట్టడికి యూజర్లకు ఈసారి బ్లూ, గ్రే, గోల్డ్ కలర్​ టిక్​లను కేటాయిస్తామని ఆ సంస్థ ఓనర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. కంపెనీలకు గోల్డ్, ప్రభుత్వాలకు గ్రే, వ్యక్తులకు బ్లూ టిక్ మార్క్స్ కేటాయిస్తామని మస్క్ తెలిపారు. ఫేక్ అకౌంట్ల సమస్యను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ‘‘సబ్ స్ర్కిప్షన్ తీసుకున్న కొంతమంది తమను తాము సెలబ్రిటీలుగా ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం చేశారు. ఇలాంటి ఘటనలు మా దృష్టికి వచ్చాయి. 

బ్లూ టిక్​ సబ్ స్ర్కిప్షన్ తీసుకున్న ఒక యూజర్ తనను బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ గా ప్రచారం చేసుకుని బాస్కెట్ బాల్ టీం అయిన లాస్ ఏంజెల్స్ లేకర్స్ నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. అతని ట్వీట్ కు బ్లూ టిక్ మార్క్ ఉండడంతో చాలా మంది అది నిజమేనని నమ్మి మోసపోయారు. ఆ ట్వీట్ నిజంగా లెబ్రాన్ జేమ్స్​ చేశాడనుకొని డబ్బు సాయం చేశారు. ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే సదరు యూజర్  అకౌంట్ ను సస్పెండ్ చేశాం. ఈ నేపథ్యంలోనే వెరిఫికేషన్ ప్రాసెస్​ను మళ్లీ తీసుకొస్తున్నాం. వచ్చే నెల 2 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది” అని మస్క్ చెప్పారు. వెరిఫై చేసిన అకౌంట్లన్నింటినీ మాన్యువల్ గా అథెంటికేట్ చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియ బాధాకరమే అయినా అనివార్యమని పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ అఫీషియల్ లేదా పెయిడ్ సబ్ స్ర్కైబర్ గా వెరిఫై అయిన వ్యక్తికి ఇంతకుముందు ఇచ్చిన బ్లూ టిక్ మార్కే కేటాయిస్తారా అని ఓ యూజర్ మస్క్ ను అడగగా.. వెరిఫై అయిన వ్యక్తులందరికీ అదే బ్లూ టిక్ మార్క్ ఇస్తామని మస్క్ జవాబు ఇచ్చారు. అయితే ఇండియాలో బ్లూ టిక్ మార్క్ కోసం సబ్ స్ర్కైబ్ చేసుకోవాలంటే యూజర్ నెలకు రూ.719 చెల్లించాలి.