రూ. 399 పాలసీ.. బీమా సౌకర్యం రూ. 10 లక్షలు 

రూ. 399 పాలసీ.. బీమా సౌకర్యం రూ. 10 లక్షలు 

కరోనా తర్వాత ఆరోగ్య బీమా చేయించుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది.  ఫ్యామిలీ ప్యాకేజ్ బీమాతో పాటు.. వ్యక్తిగతంగా కూడా బీమా తీసుకుంటున్నారు.  ఇలాంటి సౌకర్యాలు కల్పించే బీమా సంస్థలు చాలా ఉన్నాయి. అయితే   పోస్టల్ శాఖ కూడా ఇలాంటి బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది.  ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ ప్రత్యేక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకొచ్చింది. ఈ గ్రూప్ యాక్సిడెంటల్ పాలసీ కోసం టాటా AIGతో కలిసి పని చేస్తోంది.  ఇందులో సంవత్సరానికి రూ. 299, రూ. 399 ప్రీమియంతో  ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. దీంతో దాదాపు రూ. 10 లక్షల బీమా పొందవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతాదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. 

పాలసీ వివరాలు 

ఆస్పత్రిలో చికిత్స సమయంలో.. IPD ఖర్చుల కోసం రూ. 60 వేలు, ప్రమాదవశాత్తు గాయం అయితే OPD కోసం రూ. 30 వేలు ఇస్తారు. ఖాతాదారుడు ప్రమాదంలో మరణిస్తే అంత్యక్రియల కోసం ఆధారపడిన వారికి రూ. 5,000 సహాయం, పిల్లల చదువు కోసం రూ. 1 లక్ష పరిహారం అందిస్తుంది. దీనితో పాటు రవాణా ఖర్చు కూడా అందుబాటులో ఉంటుంది. ప్రమాదంలో ఒక వేళ అంగవైకల్యం చెందితే.. ఖాతాదారునికి రూ.10 లక్షల పరిహారం అందుతుంది. రూ.299 పాలసీలో ,  రూ.399లో కూడా ఈ  సౌకర్యాలు ఉటాయి. కానీ, ఈ రెండు పథకాల మధ్య ఒకే ఒక్క తేడా ఉంది.. 

అదేంటంటే.

రూ.299 ప్రమాద రక్షణ పథకంలో మరణించిన వారిపై ఆధారపడిన వారి పిల్లల చదువుకు సహాయం మొత్తం అందుబాటులో ఉండదు. మిగతా సౌకర్యాలన్నీ ఉంటాయి.రూ.399 ప్లాన్ వివరాలు ఇలా ఉన్నాయి.  ఖాదారారుడు మరణిస్తే రూ.10 లక్షలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.10 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.10 లక్షలు, వైద్య ఖర్చుల కింద రూ.60 వేలు, విద్యా ప్రయోజనాల కింద రూ.లక్ష, ఆసుపత్రిలో రోజూవారి నగదు కింద.. 10 రోజుల వరకు రోజుకు రూ.వెయ్యి చెల్లిస్తారు.ఇటీవల ఈ పథకానికి అనూహ్య స్పందన వస్తోంది. 

పాము కాటుతో మరణించినా, అంగవైకల్యం జరిగినా, విద్యుత్ షాక్ తో మరణించినా బీమా వర్తిస్తుందని అధికారులు తెలిపారు.  అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరినా ఇన్సురెన్స్ వర్తిస్తుంది. దీంతో ప్రజలు అధికసంఖ్యలో బీమా చేయించుకుంటున్నారు. ఖాతాదారుడి వయస్సు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.