
అలహాబాద్ : దేశంలో ఒమిక్రాన్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకూ కేసులు ఎక్కువవుతుండటంపై అలహాబాద్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ ను అభ్యర్థించింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న దృష్యా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని అలహాబాద్ హైకోర్టు ప్రధాని మోడీని కోరింది.
కొత్త వేరియెంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున.. న్యాయస్థానం ఎన్నికల కమిషన్, ప్రధానికి పలు సూచనలు చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉందని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. వాటికి అనుమతిస్తే యూపీలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలను కనీసం రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలు తీసుకోవాలని సూచించిన అలహాబాద్ హైకోర్టు.. ప్రచారం కోసం రాజకీయపార్టీలు టీవీలు, న్యూస్ పేపర్లను ఎంచుకోవచ్చని అభిప్రాయపడింది.
మరిన్ని వార్తల కోసం..
విజృంభిస్తున్న ఒమిక్రాన్.. 350 దాటిన కేసులు