
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఢిల్లీలో పోస్టర్లు వెలిశాయి. అయితే, ఆ పోస్టర్లపై తనకు అభ్యంతరం లేదని, వాటిని అంటించినవారిని అరెస్ట్ చేయొద్దని కేజ్రీవాల్ పేర్కొన్నారు. "కేజ్రీవాల్ హఠావో, ఢిల్లీ బచావో" (కేజ్రీవాల్‌ను తొలగించండి, ఢిల్లీని రక్షించండి) అని రాసి ఉన్న పోస్టర్‌లను బీజేపీ నాయకుడి పేరిట ఢిల్లీ అంతటా అంటించారు. "మోదీ హఠావో, దేశ్ బచావో" అంటూ పోస్టర్లు వెలిసిన ఒక రోజు తర్వాత అంటించారు. ఈ పోస్టర్లు అంటించిన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి 49 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. కేజ్రీవాల్ మాత్రం ‘‘ఢిల్లీలో ప్రజలు నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు.. దీనికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. ప్రజాస్వామ్యంలో తమ నాయకుడికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ప్రజలకు ఉంది” అని ట్వీట్ చేశారు. తనకు వ్యతిరేకంగా పోస్టర్లు వేసినవారిని అరెస్టు చేయొద్దని సూచించారు. కాగా, బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా పేరిట ఈ పోస్టర్లు అంటించారు. కేజ్రీవాల్ నిజాయితీ లేనివాడు, అవినీతిపరుడని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. ఈ అంశంపై సిర్సా స్పందిస్తూ.. విద్య, వైద్యం, ఎక్సైజ్ శాఖల్లో కేజ్రీవాల్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాము నిజాయితీపరులమని, కేజ్రీవాల్‌పై పోస్టర్లు వేసినట్లు ఒప్పుకోవడానికి భయపడబోమని సిర్సా పేర్కొన్నారు.