వాయిదాపడిన పరీక్షలు మే, జూన్​లో నిర్వహించే ఏర్పాట్లు

వాయిదాపడిన పరీక్షలు మే, జూన్​లో నిర్వహించే ఏర్పాట్లు
  • లీకేజీ ఇష్యూ తేలకపోవడంతో టీఎస్​పీఎస్సీ యోచన

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో ఏప్రిల్​లో జరగాల్సిన ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4 పరీక్ష లు రద్దు చేయగా, 2 ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. లీకేజీ ఇష్యూ తేలకపోవడంతో ఏప్రిల్​లో జరగాల్సిన 4 పరీక్షలను వాయిదా వేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. వాయిదాపడ్డ పరీక్షలన్నీ మే, జూన్​లో నిర్వహించాలని యోచిస్తోంది.

ఏప్రిల్​లో నాలుగు పరీక్షలు

టీఎస్​పీఎస్సీ గతేడాది మొత్తం 26 నోటిఫికేషన్లు ఇవ్వగా, వాటిలో ఏడు పరీక్షలు జరిగాయి. వీటిలో గ్రూప్1 ప్రిలిమ్స్​ తోపాటు అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏఈఈ), డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్(డీఏవో) పేపర్ల లీక్ అయిందనే కారణంతో టీఎస్​పీఎస్సీ ఎగ్జామ్స్​ రద్దు చేసింది. ఈ నెలలో మార్చిలో జరగాల్సిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలనూ వాయిదా వేసింది. సిట్ దర్యాప్తులో రోజుకో వ్యవహారం బయటపడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలూ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ లో పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4న హార్టికల్చర్ ఆఫీసర్, 23న అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్​స్పెక్టర్, 25న అగ్రికల్చర్ ఆఫీసర్, 26,27 గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్ పరీక్షలు జరగాల్సి ఉంది. వీటన్నింటినీ వాయిదా వేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ పేపర్లూ లీక్​ అయ్యాయనే ఆరోపణలతో కొత్త పేపర్లను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇక బయోమెట్రిక్ అటెండెన్స్

పేపర్ల లీకేజీతో ఇక నుంచి జరిగే పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయించింది. ప్రతి పరీక్షకూ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని, పరీక్షల సెంటర్లలోని ప్రతి రూమ్​లో సీసీటీవీ కెమెరాలు, ప్రతి సెంటర్ ఎంట్రెన్స్ లో మెటల్​ డిటెక్టర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు బయోమెట్రిక్ అటెండెన్స్ పెట్టినా.. చాలా సెంటర్లలో దాన్ని అమలు చేయలేదు. ఎక్కువగా కంప్యూటర్ బెస్డ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నారు.