- పట్టించుకోని మున్సిపల్ అధికారులు
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెయిన్ రోడ్లు గుంతలమయంగా మారాయి. చిన్నపాటి దూరం వెళ్లాలన్న అవస్థలు పడాల్సి వస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. అశోక్‌నగర్ కాలనీ మెయిన్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, పాత బస్టాండ్‌నుంచి రైల్వే గేట్ రోడ్డు, సైలాన్‌బాబా కాలనీ, బతుకమ్మకుంట కాలనీ రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతి రోజూ వందలాది బైకులు, ఆటోలు, కార్లు, జీపులు, బస్సులు వెళ్తుంటాయి.
ఈ రోడ్ల వెంట వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు, పట్టణవాసులు కోరుతున్నారు.
అధికారుల అలసత్వం..
కామారెడ్డి పట్టణంలో రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంపై అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు సిమెంట్, బీటీ రోడ్లు తీవ్రంగా దెబ్బతినగా, ఇప్పటివరకు వాటిని పట్టించుకున్న నాథుడు లేడు. మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన క్విక్ యాక్షన్ టీమ్ కాలనీల్లోని చిన్న గుంతలను పూడ్చి మెయిన్ రోడ్లను గాలికొదిలేయడం వారి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.
రోడ్లపై తట్టెడు మట్టిపోయలే..
కామారెడ్డి పెద్ద చెరువు అలుగు పక్క నుంచి సిమెంట్ రోడ్డు ఉంది. ఈ రోడ్డు గుండా మెయిన్ రోడ్డుతో పాటు, హౌజింగ్ వైపు నుంచి దేవునిపల్లి, కల్కి నగర్ లోని ఆయా ఏరియాలకు వెళ్లటానికి దగ్గరగా ఉంటుంది. భారీ వర్షాలకు అలుగు వద్ద 2 చోట్ల రోడ్డు కొట్టుకుపోయి రెండు నెలలు అవుతున్నా తట్టెడు మట్టి పోసి పూడ్చలేదు. కనీసం హెచ్చరిక బోర్డులైనా పెట్టలేదు. రాత్రి ఈ మార్గంలో వెళ్లాలంటే నరకయాతనే. దీనికి దగ్గరలోనే నిజాంసాగర్ రోడ్డు నుంచి కేసీఆర్ కాలనీ వైపు వెళ్లే రోడ్డు గతేడాది వర్షానికి కొట్టుకుపోగా, ఇప్పటి వరకూ గుంతలు పూడ్చలేదు.
కొత్త బస్టాండు చర్చి నుంచి అశోక్‌నగర్ కాలనీ మెయిన్ రోడ్డు, రైల్వే గేట్ వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సిమెంట్, బీటీ రోడ్లు కొట్టుకుపోయి గుంతలమయంగా మారాయి. పలు కాలనీలతోపాటు కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్‌కు ఇదే మార్గం గుండా వెళ్తారు. బైక్‌లు, ఆటోల్లో వెళ్లే వాళ్లు ఇక్కట్లకు గురవుతున్నారు.
పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు వెళ్లే రోడ్డు గుంతలుగా మారింది. పంచముఖి హనుమాన్ ఆలయం ఎదురుగా ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. నిత్యం వందలాది వెహికల్స్ వెళ్తుంటాయి.
