
రాష్ట్రంలో అన్నదాతకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్తున్నా... వాస్తవంగా అలాంటి పరిస్థితి లేదు. కేవలం 7, 8 గంటలే కరెంట్ వస్తుండడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. చాలా ఏరియాల్లో నాట్ల సీజన్ కావడంతో... నీరందక పనులు సాగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు
వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని సీఎం కేసీఆర్ మొదలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్తుంటారు. అయితే సాగుకు ఎనిమిది గంటలే కరెంట్ ఇస్తున్నారని రైతులు అంటున్నారు. అది కూడా రాష్ట్రమంతా పగటి పూట ఒకే టైమ్ కు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతుంది. యాసంగి సాగు సీజన్ కావడంతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను కట్టడి చేసేందుకు డిస్కంలు ఈ నెల 18 నుంచి వ్యవసాయానికి కోతలు పెడుతున్నాయి. 15 గంటలు ఇస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ క్షేత్ర స్థాయిలో 8 నుంచి 10 గంటలకు మించి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వడం లేదు. ప్రస్తుతం రాష్ట్రమంతా వరినాట్లు జోరుగా సాగుతుండడంతో రైతులంతా ఒకే సమయంలో మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు పెడుతున్నారు. దీంతో ప్రెజర్ పెరిగి ట్రాన్స్ ఫార్మర్లు,మోటార్లు ఎక్కడికక్కడ కాలిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పగటిపూట మాత్రమే త్రీఫేజ్ కరెంట్
నిజానికి ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచే వ్యవసాయానికి కరెంట్ కోతలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా 8 నుంచి 12 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదు. ఈ యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బోర్లు, బావులు, కాల్వల కింద నార్లు పోసుకున్న రైతులు కొద్దిరోజులుగా వరినాట్లు వేసుకుంటున్నారు. ఉదయం పది కల్లా కూలీలు వచ్చేసరికి ఇరువాలు దున్ని మడులను రెడీ చేయాల్సి ఉంటుంది. రాత్రి పూట నీళ్లు పారితే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ పగటిపూట మాత్రమే త్రీఫేజ్ కరెంట్ ఇస్తుండడంతో పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అసలే గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉందని, ఉదయం పనికి వచ్చే సరికి నారు మడులను సిద్ధం చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రంగంలోకి దిగిన డిస్కంలు
యాసంగి సీజన్ కావడంతో విద్యుత్ డిమాండ్ ను కట్టడి చేసేందుకు డిస్కంలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర సర్కారు పర్మిషన్ తో ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నాయి. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కి చెందిన లోడ్ మానిటరింగ్ రెగ్యులేషన్ కమిటీ నుంచి జిల్లాల్లోని అధికారులకు ఆదేశాలు రావడంతో కొన్ని ఏరియాల్లో ఉదయం 5.30 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు, మరికొన్ని ఏరియాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నారు. దీనిపై రోజువారీగా సబ్ స్టేషన్లలోని ఆపరేటర్లకు మెసేజ్ లు వస్తున్నాయి.
లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోతున్నాయి
నిజానికి అగ్రికల్చర్ సెక్టార్ కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.15 గంటల దాకా, మళ్లీ రాత్రి 11:30 గంటల నుంచి ఉదయం 6:30 గంటల దాకా.. అంటే రోజుకు దాదాపు 15 గంటలు త్రీఫేజ్ కరెంట్ ను సరఫరా చేయనున్నట్లు ఇటీవల ట్రాన్స్కో ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఉదయం పూట మాత్రమే త్రీ ఫేజ్ కరెంటు సప్లై చేస్తుండటంతో రైతులందరూ ఒకే సారి బోర్ మోటార్లను ఆన్ చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై ప్రెజర్ పెరిగి అవి కాలిపోతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఫీజులు కొట్టేస్తున్నాయి. లైన్లు బ్రేక్డౌన్ అవుతున్నాయి. లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోతున్నాయి.