పథకాలంటే పప్పు బెల్లాలేనా..?

పథకాలంటే పప్పు బెల్లాలేనా..?

తెలంగాణ ఏర్పడ్డాక అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాలన్నీ పథకాలు, హామీల చుట్టే తిరుగుతున్నాయి. జనాల్లోనూ పథకాలు, హామీల చుట్టే చర్చలు నడుస్తున్నాయి.  కాంగ్రెస్   ఒక హామీ ఇస్తే.. బీఆర్ఎస్ రెండు హామీలు ఎక్కువే ప్రకటించింది.  ఇట్లుంది తెలంగాణలో  పార్టీల ఎన్నికల హామీల తీరు.  కొద్దిరోజుల కిందట మూడోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వచ్చింది.  దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలను వండి వార్చాయి. అధికారంలోకి రావాలంటే ఉచిత పథకాలు, హామీలు ఎక్కువ ప్రకటిస్తే చాలు.. ప్రజలే ఓట్లు వేస్తారనే ధోరణి పార్టీల్లో, నేతల్లో పెరిగిపోయింది. 

రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తన  మేనిఫెస్టోలో  పాత పథకాలు, హామీలకే  అదనంగా హామీలు జోడించి ప్రకటించింది. ఇక పదేండ్లుగా  అధికారానికి దూరమైన కాంగ్రెస్  పవర్​లోకి రావాలనే కాంక్షతో దశలవారీగా డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ స్కీమ్​లను ప్రకటించింది. రాష్ట్రం వచ్చాక అధికారం దక్కించుకోవాలంటే.. ఓట్లను రాబట్టుకోవాలంటే ఎక్కువ ఉచిత పథకాలను ప్రకటిస్తే చాలు అనేలా పార్టీల తీరు మారింది.  కేవలం పథకాలను ఓట్లు రాల్చేవిగా చేసుకుని.. వాటినే తమ మేనిఫెస్టోల్లో పెడుతున్నాయి. అసలు సంక్షేమ పాలన అంటే ఉచిత పథకాలు ఇవ్వడమేనా?  నిజానికి ఎలాంటి  పథకాలు  ఇవ్వాలి?  రాష్ట్రాభివృద్ధికి అవి ఎంత మేరకు దోహదం చేస్తాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

సంక్షేమం అంటే..? 

మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం ఆదేశిక సూత్రాల్లో ప్రజా సంక్షేమం పొందుపరుచబడింది. సమాజంలోని అట్టడుగు వర్గాలను, దారిద్య్రరేఖకు దిగువన ఉండిపోయినవారిని ఆదుకునేందుకు,  ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు, సామాజికంగా వారిని పరిరక్షించడం  ప్రభుత్వాల బాధ్యత. సంక్షేమ పథకాలకు ఉదాహరణ  విద్య, వైద్యం, గృహ వసతి, ఉపాధి కల్పన,  వృద్ధాప్య  పింఛన్​ వంటి వాటిని చెప్పొచ్చు. ఇవి ప్రజల నైతిక,  ఆర్థిక,  శక్తి సామర్థ్యాల అభివృద్ధికి దోహదపడేవిగా ఉండాలి. 

ఇక ఉచిత పథకాలపై ఎలాంటి స్పష్టత లేదు. అవి ప్రజలకు మంచివా, చెడ్డవా.. అనేది చెప్పడం కష్టం. మరోవైపు  ప్రభుత్వం ప్రకటించే పథకాలు మంచివని కొందరు అంటుంటే.. ఇం కొందరు ప్రజలను సోమరులుగా మార్చేవని నిపుణుల వాదనలు ఉన్నాయి.   అధికారంలోకి వచ్చాక వందకు వందశాతం హామీలు అమలవుతాయా..? చేస్తాయా..? అనేది ప్రశ్నలుగానే ఉంటున్నాయి. ప్రస్తుతకాలంలో పార్టీల పథకాలను రూపొందించే తీరు ఎలా తయారైందంటే, ప్రభుత్వ రాబడి, బడ్జెట్​తో పనిలేదు. ప్రజాధనం పప్పు బెల్లాల పంపకాలుగా మార్చివేశాయి. 

అప్పుల కుప్పగా రాష్ట్రం

పార్టీల మేనిఫెస్టోలను అమలు చేయాలంటే రూ. లక్షల కోట్లలో  ఖర్చు అవుతుంది. ఇప్పటికే ఉచిత పథకాల కారణంగా రూ. లక్షల కోట్లలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందనే విమర్శలు నిపుణులు నుంచి ఉన్నాయి. మళ్లీ కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే  భారీగా అప్పులు చేయాల్సి ఉంటుంది. దీంతో  అప్పుకు వడ్డీ పెరిగిపోతూ రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అప్పు చూసుకుంటే.. గతేడాది  అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరుకుందని గత శీతాకాల పార్లమెంట్‌‌‌‌ సమావేశాల్లో  కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  

రాష్ట్రం వచ్చిన నాడు అప్పు రూ.75 వేల కోట్లుగా ఉంటే..  ఆ తర్వాత నుంచి ఏటేటా  పెరుగుతూ పోతోంది. మిగులు బడ్జెట్‌‌‌‌తో ఏర్పడిన రాష్ట్రం కాస్త తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్  పాలనలో  తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిందనే ఆరోపణలు ప్రతిపక్షాలు, మేధావుల నుంచి వస్తున్నాయి. ఇక రాష్ట్ర అప్పులను పట్టించుకోకుండా పార్టీలు పోటాపోటీగా తమ మేనిఫెస్టోలో హామీల వరాలను ప్రకటిస్తున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు పార్టీలు ఓట్ల కోసం సాధ్యం కాని హామీలు ఇస్తుండగా, పరోక్షంగా తిరిగి ప్రజలపైనే మోయలేని భారం మోపేలా తయారవుతాయని పేర్కొంటున్నారు.  

భవిష్యత్ తరాలపైనే భారం

ఉచిత పథకాలు ప్రజల సమస్యలను తీర్చలేవు. వారి బతుకులను మార్చలేవు. ఉపాధి, ఉద్యోగ కల్పనతో పాటు విద్య, వైద్యం, గృహ వసతి లాంటివి  కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా,  అవకాశాలు పెంపొందేలా చేయడమే  ప్రభుత్వ బాధ్యతగా పాలన ఉండాలి. రైతుబంధు పెద్దలకు కూడా ఇస్తూ పోతే  చివరకు రాష్ట్రం అప్పుల పాలవుతుంది. గత తొమ్మిదేండ్లలో హామీ ఇచ్చిన పథకాలను చూస్తే.. దళితులకు మూడెకరాలు ఏమైంది..? నిరుద్యోగ భృతి ఎక్కడ ? అనేది.. చెప్పడం కష్టమే. భవిష్యత్ తరాలపై మోయలేని అప్పుల భారం పడుతుంది. ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలంటే ఉపాధి కల్పించాలి. జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగు పరచాలి. నాణ్యతతో  కూడిన విద్య, వైద్యం అందించాలి. సామాజిక, ఆర్థిక కోణాలో అభివృద్ధిని కాంక్షించాలి.  అంతేకానీ ఓట్ల కోణంలో కాదు.

అంతంకాని పేదరికం సామాజిక నేరం

ప్రజల్లో శక్తి సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధిని కల్పిస్తూ.. వారు కష్టపడేలా చేస్తేనే వాస్తవంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. జనాకర్షణ పథకాలు కాకుండా ప్రజా సంక్షేమాభివృద్ధి పరంగా పథకాలను అమలు చేస్తే సమ సమాజం సాక్షాత్కారమవుతుంది. ఒక తరంలో పేదరికాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, తరతరాలుగా పేదరికంలో మగ్గిపోతుండటమంటే అది సామాజిక నేరంగానే చూడాల్సి ఉంటుంది. అది పార్టీలు, పాలకులు సంక్షేమం పేరిట చేసిన పాపంగానే పరిగణించాలి.  

ఇకనైనా పాలకులు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని సంక్షోభం వైపు నెట్టేయకుండా..దుబారా పథకాలపై హామీలు ఇవ్వకుండా.. ప్రజల శక్తి సామర్థ్యాలపై, కొనుగోలు శక్తిని పెంచుకునే ఆదాయ మార్గాలపై పథకాల ఆలోచన చేస్తే  బాగుంటుంది. ఏదేమైనా  రాజ కీయ పార్టీలు ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చని పక్షంలో ఎవరినీ చట్టబద్ధంగా బాధ్యులను చేసే, శిక్షించే అధికారం లేదు. కేవలం అధికార కుర్చీ దింపడం మాత్రమే ప్రజల చేతుల్లో ఉంది.  కానీ, రాష్ట్రంపై పడిన అప్పుభారం మాత్రం భవిష్యత్​ తరాలపైనే పడుతుంది.

- వేల్పుల సురేష్, సీనియర్​ జర్నలిస్ట్