
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. సోమవారం సదరన్ డిస్కం పరిధిలో 250 మంది ఇంజనీర్ లకు మంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. నాడు ఉద్యమ నాయకుడిగా ఏదైతే కేసీఆర్ చెప్పారో.. ఇయ్యాల సీఎంగా అన్ని అడ్డంకులు అధిగమించి కరెంటు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు కష్టపడి పని చేయడంతోనే అన్ని అధిగమించామన్నారు. 22,774 మంది ఆర్టిజన్‌లను శాశ్వత ఉద్యోగులుగా నియామకం చేసినట్లు చెప్పారు. నాడు 5,600 మెగావాట్ విద్యుత్ డిమాండ్ ఉంటే కోతలు లేకుండా సరఫరా చేయలేకపోయారని, నేడు 14వేల మెగావాట్‌లు డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సరఫరా చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఫ్రీ కరెంట్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. సీఎంగా కేసీఆర్ ఉన్నంత వరకు రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.