HanuPrabhas: బర్త్ డేకి ముందే బ్లాస్ట్.. ప్రభాస్ హను మూవీ అప్డేట్ వచ్చేసింది..

HanuPrabhas: బర్త్ డేకి ముందే బ్లాస్ట్.. ప్రభాస్ హను మూవీ అప్డేట్ వచ్చేసింది..

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ లైనప్లో ఉన్నారు. డార్లింగ్ ఊపు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో ఫస్ట్ ఆడియన్స్ ముందుకి వచ్చేది రాజాసాబ్, ఆ తర్వాత హను రాఘవపూడి ఫౌజీ, ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్.. ఆ నెక్స్ట్ కల్కి 2, సలార్ 2. ఇవే కాదండోయ్ ఈ క్రమంలోనే కొత్త కథలు కూడా వింటూ బిజీగా ఉన్నారు ప్రభాస్. 

ఇదిలా ఉంటే.. ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23) సందర్భంగా వరుస అప్డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బర్త్ డేకి ఒకరోజు ముందుగానే ఇవాళ (అక్టోబర్ 22న) స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. టైటిల్ టీజ్ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఈ పోస్టర్లో ప్రభాస్ చేతిలో బ్రీఫ్‌కేస్.. స్టైలిష్ డీబోనెయిర్ సూట్‌లో.. బ్రిటిష్ జెండాతో కప్పబడిన నేలపై నడుస్తున్నాడు. ‘1932 నుంచి ఇతడి కోసం అందరూ వెతుకుతున్నారు’ మరియు ‘ఒంటరిగా నడిచే ఒక బెటాలియన్’ అనే పదాలు పోస్టర్లో ఉండటంతో సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నాయి.

అయితే, ఈ రెండూ పంక్తులు అతని తిరుగుబాటు స్వభావాన్ని మరియు ఆక్రమణదారుల నుండి భారతదేశానికి స్వేచ్ఛను సాధించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుండటం విశేషం. చివర్లో ‘పాండవ పక్ష సంస్థి కర్ణః’ అంటే ‘పాండవుల పక్షాన ఉన్న కర్ణుడు..’అని ట్యాగ్ మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. 

ఇన్నాళ్లు ‘ప్రభాస్ హను’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ను అధికారికంగా ఫిక్స్ చేయనున్నట్లు టాక్. మూవీ అనౌన్స్ టైం నుంచే ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నప్పటికీ, రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. పీరియడ్ హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా హను రాఘవపూడి తెరకెకెక్కిస్తున్నారు. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్తో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే కథాంశంతో రూపొందుతోందని తెలుస్తోంది.

Also Read : నాకు కోపం రాదా.. నేనూ మనిషినే కదా

ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ పోస్టర్ సైతం ప్రభాస్ క్యారెక్టర్ని సూచిస్తుంది. ఇందులో ‘‘చుట్టూ తుపాకుల నుంచి ఫైరింగ్ అవుతున్న దృశ్యాలు, యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి’’. పోస్టర్‌పై ఉన్న సంస్కృత శ్లోకాలు సినిమా నేపథ్యాన్ని సూచిస్తున్నాయి. ముఖ్యంగా ‘అధర్మస్య సమ్ముఖే సః ఛాయాభ్యః సముత్తిష్ఠతి, పద్మవ్యూహ విజయీ పార్థః’ అనే పదాలు ఆకట్టుకుంటున్నాయి. దీని అర్థం - ‘‘అధర్మాన్ని ఎదుర్కొంటూ అతను నీడల నుంచి లేస్తాడు, పద్మవ్యూహాన్ని ఛేదించిన విజేత అర్జునుడిలా’’ అని.

ఇది సినిమాలో ప్రభాస్ పాత్ర గొప్ప శౌర్యంతో కూడినదని, అతను ఒంటరిగా ఒక బెటాలియన్‌కు సమానమని సూచిస్తుంది. పోస్టర్‌లో 'ఆపరేషన్ జెడ్'  అనే లెటర్స్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేయడంతో, సినిమా కథాంశం ఏదైనా మిలిటరీ మిషన్ లేదా రహస్య ఆపరేషన్ చుట్టూ తిరుగుతుండవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్కు జంటగా ఇమాన్వి ఎస్మెయిల్ నటిస్తుండగా, సీనియర్ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజాలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీతారామం ఫేమ్' విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు, కృష్ణ కాంత్ లిరిక్స్ అందిస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌గా కమల్ కణ్ణన్, ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు పనిచేస్తున్నారు. టీ-సిరీస్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ వంటి ఆరు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల కానుంది.