
ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో రెండు నెలల ముందుగానే ప్రమోషన్‌లో స్పీడు పెంచారు. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం ‘జై శ్రీరామ్’ అనే పాటను విడుదల చేశారు. నిమిషం నిడివి గల ఈ లిరికల్ వీడియోను ఐదు భాషల్లో విడుదల చేశారు. హిందీలో భక్తి పాటలు కంపోజ్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న అజయ్, అతుల్ ఈ పాటను కంపోజ్ చేశారు. ‘‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం.. సఫలం స్వామి కార్యం. మా బలమేదంటే.. నీపై నమ్మకమే.. తలపున నువ్వుంటే సకలం మంగళమే.. మహిమాన్విత మంత్రం.. నీ నామం. జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. జై శ్రీరామ్.. రాజారాం”అంటూ రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. రావణ లంకను చేరడానికి వానర సేన వారధి కట్టే సమయంలో వచ్చే పాట ఇదని అర్థమవుతోంది. ఇక పాటతో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో విల్లు ఎక్కుపెట్టిన రాముడిగా ప్రభాస్ లుక్ ఆకట్టుకుంది. ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, సుతారియా సుటారియా, రెట్రోఫైల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.