
‘లక్షలు లేకపోయినా కాళ్లూ చేతులూ లక్షణంగా ఉంటే చాలు. అదే పది వేలు. బలుసాకు తినైనా బతికేయొచ్చు’ అనుకునేవారు దేశంలో కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆర్థికంగా వెనకబడ్డవారికి హెల్త్‌పరంగా ఏదైనా జరిగితే ఆదుకోవటానికి మోడీ సర్కారు ‘ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన’ని ఏడాదిన్నర కిందటే తెచ్చింది. ఈ బీమా పథకాన్ని మరింత బాగా అమలుచేసి ప్రజలకు ఆరోగ్య హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోనుంది. ఎంబీబీఎస్, మెడికల్ పీజీ సీట్లు, హాస్పిటల్స్ సంఖ్య పెంచనుంది. హెల్త్ సెక్టార్‌ని ఉమ్మడి జాబితాలోకి తేనుంది.
ఆరోగ్య రంగంలో సంస్కరణలకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా చేపట్టాల్సిన చర్యల్ని సూచించేందుకు ఏర్పాటుచేసిన హైలెవెల్ కమిటీ ఈ మధ్యే రిపోర్ట్ ఇచ్చింది. దీంతో వాటి అమలుకు ప్రభుత్వం చకచకా కదులుతోంది. రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ హెల్త్ కేర్ అనేది ఇన్నాళ్లూ రాష్ట్రాల జాబితాలోనే ఉంది. దాన్ని ఇకపై కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలోకి తేనున్నారు. తద్వారా ఈ సెక్టార్‌పై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనానికి కేంద్రం చెక్ పెట్టి తన పట్టు పెంచుకుంటుంది. హైలెవెల్ కమిటీ ఇచ్చిన రికమండేషన్లలో ఇది కూడా ఒకటి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ రంగంలో హాస్పిటల్స్‌ను ఏర్పాటుచేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధాలుగా సహకరించాలి. భూములను త్వరగా కేటాయించాలి. కరెంట్, వాటర్, భవన నిర్మాణ, రిజిస్ట్రేషన్ అనుమతులు వంటి వాటిని సకాలంలో మంజూరు చేయాలి. 200 పడకల హాస్పిటల్ కట్టాలంటే కోట్లలో ఖర్చవుతుంది. అంత బడ్జెట్ లేని ఆర్గనైజేషన్ల కోసం రైతులకు ఇచ్చినట్లు తక్కువ వడ్డీకి రుణాలు అందజేయాలి. రెసిడెన్షియల్ రేట్లకే నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా స్పెషల్ క్లియరెన్స్‌లు ఇవ్వాలి.
ఈ పనులన్నీ సజావుగా సాగాలంటే వేర్వేరు ప్రభుత్వ విభాగాల మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. సెంట్రల్ గవర్నమెంట్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్న నీతి ఆయోగ్ రూపొందించిన అడ్వైజరీ నోట్‌ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అదనపు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ఆపరేషన్ల సంఖ్య డబుల్ అవుతుంది. ఆ డిమాండ్‌ను తట్టుకోవాలంటే కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది.
కేటాయింపులు పెంచాలి
15వ ఆర్థిక సంఘం ఏర్పాటుచేసిన ఈ హైలెవెల్ కమిటీ వివిధ రంగాల ప్రముఖులతో చర్చించాకే డిటేల్డ్‌గా 120 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. ఈ సంప్రదింపుల్లో నీతి ఆయోగ్, హెల్త్ మినిస్ట్రీ అధికారులను, పాలసీ నిపుణులను, కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతినిధులను భాగస్వాముల్ని చేశారు. వీళ్లంతా కలిసి చాలాసార్లు మాట్లాడుకొని చెప్పుకోదగ్గ రికమండేషన్లే ఇచ్చారు. హెల్త్ కేర్‌కి కేటాయించే బడ్జెట్ వాటాని జీడీపీలో 2.5 శాతానికి పెంచాలని వారందరూ సూచించారు.
భిన్న వాదనలు
ప్రైమరీ హెల్త్ కేర్‌లో భారీ పెట్టుబడులు పెట్టాలని, అవి మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లోని మూడులో రెండో వంతుకు దాదాపు సమానంగా ఉండాలని కమిటీ సభ్యులు అన్నారు. రాష్ట్రాల హెల్త్ బడ్జెట్లోని కనీసం రెండు శాతాన్ని రీసెర్చ్ యాక్టివిటీస్‌కి ఇవ్వాలని చెప్పారు. అయితే.. మెజారిటీ రికమండేషన్లపై పబ్లిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్‌లు భిన్నంగా స్పందిస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు తమకు అనుకూలంగా సూచనలు ఇచ్చారంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ సలహాదారు సునీల్ నందరాజ్ తప్పుపట్టారు.
అందరికీ ఆరోగ్యం హక్కు
2021 ఆగస్టు 15 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. అప్పటికి ‘ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు’గా ప్రకటించాలని మోడీ గవర్నమెంట్ గట్టి పట్టుదలతో ఉంది. ఇది సాధించడానికి వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 3,000 నుంచి 5,000 వరకు 200 పడకల ప్రైవేట్ హాస్పిటల్స్‌ను అదనంగా ఏర్పాటు చేయించటానికి ప్లాన్ రెడీ చేసింది. ఎంబీబీఎస్ సీట్లను 2025 నాటికి రెట్టింపు చేయాలని చూస్తోంది. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను కూడా వాటికి సమానం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రైవేట్ సంస్థలు కొత్త దవాఖానాలను టయర్–2, టయర్–3 టౌన్లలో, వైద్య సేవలు అందుబాటులో లేని అండర్ సర్వీస్డ్ ప్రాంతాల్లో ఏర్పాటుచేసేందుకు అన్ని విధాలుగా సహకరించాలంటూ కేంద్రం రాష్ట్రాలను ఇటీవల కోరింది. రాష్ట్రాలు సానుకూలంగా స్పందించటం మోడీ ప్రభుత్వంలో కొత్త ఉత్సాహం నింపింది. ఇండస్ట్రీ–ఫ్రెండ్లీ పాలసీని రూపొందించింది. ఈ యోజన మరింత బాగా అమలు కావాలంటే హెల్త్ కేర్ సెక్టార్లో ఇప్పుడున్న వసతులు ఏమాత్రం చాలవనే అంచనాకు వచ్చింది.