ప్రజలకు ఫాయిదాలేని ప్రగతి భవన్ పేల్చాల్సిందే : రేవంత్

ప్రజలకు ఫాయిదాలేని ప్రగతి భవన్ పేల్చాల్సిందే : రేవంత్

ప్రగతి భవన్ ను పేల్చేయాలన్న తన వ్యాఖ్యల్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. ప్రజలకు ఉపయోగపడనప్పుడు ప్రగతి భవన్ అయినా డైనమైట్లతో పేల్చాయాల్సిందేనని అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తులకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్న రేవంత్.. ఉద్యమద్రోహులంతా ఇప్పుడు అక్కడే చేరానని విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో నిర్మించిన ప్రగతి భవన్ లోకి సామాన్యులను ఎందుకు అనుమతించరని నిలదీశారు. నిజాం తనను తాను కాపాడుకోవడానికి రజాకార్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే.. పోలీసుల అండతో కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. 9నెలల్లో సెక్రటేరియెట్, ప్రగతి భవన్ నిర్మాణం పూర్తైనప్పుడు అమరుల స్థూపం కట్టేందుకు 8ఏండ్లు ఎందుకు పట్టిందని రేవంత్ ప్రశ్నించారు. 

సీఎం కేసీఆర్ దుబారా ఖర్చును తగ్గిస్తే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా మారుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్యమకారుడు, విద్యావంతుడైన రసమయి బాలకిషన్ను ... అతన్ని మంత్రిని చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళు మీద కేసీఆర్ పడ్డాడరని.. కేసీఆర్ కు చేతకాకనే కోదండంరాంను ఛైర్మన్ ను చేశారని ఆరోపించారు. నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అదే తాను అంటే తనపై కేసులు పెట్టారన్నారు. మీ కుటుంబ సభ్యులకు పదవులు కట్టబెట్టడం నక్సలైట్ ఎజెండానా అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం తెలంగాణ వాణిని వినిపించిందన్న రేవంత్ రెడ్డి... తుది దశ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పెట్టిందని గుర్తు చేశారు.

తెలంగాణలో ప్రజా పాలన కోసం మరో ఉద్యమం తప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కేసులైనా ఎదుర్కొవడానికైనా సిద్దమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమరుల కుటుంబాలకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పోడు భూముల సమస్యలు,పేదలకు ఇళ్లు, వరంగల్ రైతుల డిక్లరేషన్ ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న 317 జీవోను కూడా రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల టికెట్ కేటాయింపూల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు.