బతుకమ్మకు నైవేద్యం

బతుకమ్మకు నైవేద్యం

వేపకాయల బతుకమ్మ 

ఏడవ రోజు ‘అక్టోబర్ 1(శనివారం)’ ‘ఆశ్వయుజ షష్టి’ రోజున వేపకాయల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూల తో ఏడంతరాలు పేర్చుతారు. బతుకమ్మకు వాయనంగా సకినాల పిండి, లేదా బియ్యప్పిండిని వేపకాయల్లా చేసి ఇస్తారు. లేదా పప్పు, బెల్లం నైవేద్యంగా పెడతారు.

ప్రసాదం

కావాల్సినవి

నీళ్లు – తగినన్ని, నువ్వులు– కొద్దిగా, 

బియ్యప్పిండి– రెండు టేబుల్‌‌ స్పూన్లు, 

ఉప్పు– తగినంత,

నూనె– వేగించేందుకు సరిపడా

తయారీ: ఒక గిన్నెలో బియ్యప్పిండి, నువ్వులు, ఉప్పు వేసి వేడి నీళ్లతో చపాతీ పిండిలా కలపాలి. కొంచెం పిండి తీసుకొని వేపకాయల్లా చేయాలి. కడాయిలో నూనె వేడిచేయాలి. తయారు చేసిన వేప కాయలను నూనెలో ఎర్రగా వేగించాలి.

వెన్నముద్దల బతుకమ్మ 

బతుకమ్మ పండుగలో ఎనిమిదవ రోజు ‘ఆశ్వయుజ సప్తమి’ ‘అక్టోబర్‌‌‌‌ 2 (ఆదివారం)’ వెన్నముద్దల బతుకమ్మగా గౌరమ్మను కొలుస్తారు. తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డిపూలతో ఎనిమిది అంతరాల బతుకమ్మ పేర్చుతారు. ఈరోజు నువ్వులు, వెన్నముద్ద, బెల్లం కలిపి నైవేద్యంగా బతుకమ్మకు సమర్పిస్తారు. 

ప్రసాదం

కావాల్సినవి 

బియ్యప్పిండి– నాలుగు టేబుల్‌‌ స్పూన్లు, 
వెన్న– రెండు టేబుల్‌‌ స్పూన్లు, 
నీళ్లు – కొద్దిగా, నూనె– వేగించేందుకు సరిపడా, యాలకులు– 4, చక్కెర– అర గ్లాస్‌‌

తయారీ

గిన్నెలో బియ్యప్పిండి, వెన్న వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా వేడి నీళ్లు పోస్తూ బియ్యప్పిండిని చపాతీ పిండి ముద్దలా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఉండలు చేయాలి.  నూనె వేడిచేసి ఆ ఉండలను ఎర్రగా వేగించాలి. ఇంకో గిన్నెలో చక్కెర వేసి, అరగ్లాసు నీళ్లు పోసి పాకం పట్టాలి. చివర్లో యాలకులు వేసి స్టవ్‌‌ ఆపేయాలి. పాకంలో వెన్న ముద్దలను వేయాలి.