గాంధీ జయంతి నాడు పీకే కొత్త పార్టీ

గాంధీ జయంతి నాడు పీకే కొత్త పార్టీ
  • బిహార్‌‌లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటన

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ యాత్ర కన్వీనర్ ప్రశాంత్‌‌ కిశోర్‌‌ తన కొత్త రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారు చేశారు. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న అధికారికంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. తాను చేపట్టిన జన్ సూరాజ్ యాత్ర అక్టోబర్ 2 నాటికి రెండేండ్లు పూర్తవుతాయని తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిహార్‌‌లోని మొత్తం 243 స్థానాల్లోనూ  పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 75 స్థానాల్లో ముస్లింలనే బరిలోకి దింపుతానని చెప్పారు.

అంతకుముందే పార్టీకి సంబంధించిన వ్యవహారాలను చూసుకునేందుకు 21 మంది నేతలతో కూడిన ప్యానెల్‌‌ను ఏర్పాటు చేయాలని చేస్తామని వెల్లడించారు. తన పార్టీలో దళితులకు, ముస్లింలకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. కులం, మతం ఆధారంగా ఓటు వేయడం మానేయాలని ప్రజలను కోరారు. బిహార్​లో ముస్లింలకు నాయకుడు లేకపోవడంతో వారు భయపడి ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో దళితులు, ముస్లింల మొత్తం వాటా 37 శాతంగా ఉంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో దళితులను పెద్ద ఎత్తున బరిలోకి దింపాలనే వ్యూహంతో ప్రశాంత్‌‌ కిశోర్‌‌ కసరత్తు ప్రారంభించారు. 2022 అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ బిహార్ లోని పశ్చిమ చంపారన్ నుంచి జన్ సూరజ్ యాత్రను ప్రా రంభించారు. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో మొత్తం 5 వేల కిలోమీటర్లు ప్రయాణించారు.