
వాళ్లిద్దరు కాబోయే దంపతులు. కానీ అంతలోనే అనుకోని విషాదం. మాయదారి మృత్యువు ప్రీ వెడ్డింగ్ షూట్ రూపంలో కభళించింది. క్యాతమరానహళ్లికి చెందిన చంద్రు(28), శశికళ(20) ఈ ఏడాది నవంబర్ 22న పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లంటే మాటలా ఇంట్లో ఒకటే హాడావిడి. పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.
అయితే కాబోయే వధువరులు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవాలని ముచ్చటపడ్డారు. ముందుగా అనుకున్న ప్రకారం చంద్రు, శశికళలు ముదుకుతూర్‌లో కావేరీ నదీ తీరాన మోటార్‌బోటు ఎక్కారు. అనంతరం చంద్రు, శశికళలు టైటానిక్ సినిమాలోకి హీరోహీరోయిన్లలా ఫోజులిస్తుంటే ఫోటో గ్రాఫర్ ఫోటోలు తీస్తున్నారు. ఈ సందర్భంగా వధువు శశికళ హైహిల్స్ వేసుకొని ఫోజులిస్తుండగా..బోటు ఒక్కసారి పక్కకు ఒరిగింది. దీంతో ఇద్దరు అదుపు తప్పి కావేరీ నదిలో పడిపోయారు. దీంతో వాళ్లిద్దరిని కాపాడేందుకు ఫోటో గ్రాఫర్ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో కాబోయే వధువు, వరుడులు ప్రాణాలు కోల్పోయారు. ఫొటోగ్రాఫర్ ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రు, శశికళ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు.