డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

డయేరియా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో తాగేనీళ్లు కాస్త కలుషితమైతే చాలు, వెంటనే విరేచనాలు పట్టుకుంటాయి. కొన్నిరోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎక్కడచూసినా మురికి నీళ్లే కనిపిస్తున్నాయి. దీంతో గ్రామాల్లో డయేరియా కేసులు ఎక్కువయ్యాయి. డయేరియాతో ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా ఉన్నారు. ఈ డేంజరస్ డయేరియా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ మాటల్లోనే..

వర్షాలు కురుస్తున్నప్పుడు గ్రామాల్లో పైప్‌‌లైన్లు పగలడం, ట్యాంకుల్లో కలుషిత నీరు చేరడం వల్ల డయేరియా లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. తాగేనీళ్లతో పాటు తినే ఫుడ్ కలుషితమైనా, వ్యక్తిగత శుభ్రత లేకున్నా డయేరియా సోకుతుంది. సరైన ట్రీట్మెంట్ అందిస్తే డయేరియాను సులువుగా తగ్గించొచ్చు. అలాగే కొన్ని జాగ్రత్తలతో డయేరియా రాకుండా చూసుకోవచ్చు.

రెండు రకాలు
డయేరియా అనేది పసిపిల్లల నుంచి ముసలివారి వరకు అన్ని వయసుల వారికి వచ్చే సాధారణ వ్యాధి. ఇందులో ముఖ్యంగా రెండు రకాలున్నాయి. ఒకటి నీళ్ల విరేచనాలు-. దీన్ని ‘నార్మల్  డయేరియా’ అంటారు. రెండోది.. రక్తం, బంకతో వచ్చే విరేచనాలు- దీన్ని ‘డిసెంట్రీ’ అంటారు.  పిల్లల్లో వచ్చే డయేరియాకు ‘రోటా వైరస్’, పెద్దవాళ్లలో వచ్చే డయేరియాకు ‘నోరో వైరస్‌‌’లు కారణం. ఇవేకాకుండా రకరకాల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు, జీర్ణ వ్యవస్థ దెబ్బ తినడం, ఫుడ్ పాయిజనింగ్ లాంటివి కూడా డయేరియాకు కారణమవుతాయి. డయేరియా సోకినప్పుడు శరీరంలో నీటిశాతం, లవణాలు తగ్గిపోతాయి. దానివల్ల నీరసంగా తయారవుతారు. ఆ టైంలో శరీరానికి సరిపడా లవణాలు అందించకపోతే డీహైడ్రేషన్ ఎక్కువై పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందుకే డయేరియాను వెంటనే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.

లక్షణాలు ఇలా..
డయేరియా సోకినప్పుడు విరేచనాలతో పాటు జ్వరం, వాంతులు, దాహం ఎక్కువవడం,  నీరసం, గుండెదడ, నోరు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, కడుపు నొప్పి లాంటి  లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల్లో డీహైడ్రేషన్‌‌ ఎక్కువైతే నాడి వేగం తగ్గి, బేహాష్ అయ్యే  అవకాశం ఉంది. పిల్లలు, వృద్ధుల్లో డయేరియా సమస్య ఎక్కువైతే  కోలుకోవడం కష్టం. అందుకే లక్షణాలు ఎక్కువైనప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. డాక్టర్లు రక్తంలో లవణాలు ఏ స్థాయిలో ఉన్నాయో పరిశీలించి ట్రీట్మెంట్ చేస్తారు.

ఎప్పుడు ప్రమాదమంటే..
నీళ్ల విరేచనాల వల్ల శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి రిప్లేస్​ చేయొచ్చు. దానికోసం గ్లూకోజ్, ఓఆర్‌‌‌‌ఎస్, కొబ్బరినీళ్లు లాంటివి తీసుకోవాలి. విరేచనాలతో పాటు వాంతులు కూడా అవుతుంటే సెలైన్ ఎక్కించాల్సి రావొచ్చు.  తగినంత విశ్రాంతి తీసుకుంటూ డాక్టర్ సూచించిన మందులు వాడితే  వాంతులు, విరేచనాలు తగ్గుతాయి. అలాకాకుండా విరేచనాల్లో రక్తం, జిగురు లాంటివి కనిపిస్తుంటే, మూడు రోజులైనా విరేచనాలు, వాంతులు తగ్గకపోతే.. వెంటనే డాక్టర్‌‌ను కలవాలి. బంక విరేచనాల ద్వారా పేగుల్లో ఉండే మ్యూకస్ బయటకొచ్చేస్తుంది. దానివల్ల పేగులకు పోషకాలు, లవణాలను శోషించుకునే శక్తి తగ్గిపోతుంది. అప్పుడు బ్లడ్ ప్రెషర్ ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. ఈ స్థితిలో సరైన ట్రీట్మెంట్ అందకపోతే కిడ్నీలు ఫెయిల్ అవ్వొచ్చు. అలాగే బీపీ పడిపోవడం వల్ల కొన్నిసార్లు బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినొచ్చు. దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదముంది. కాబట్టి రక్తం, బంక విరేచనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

సోకినప్పుడు ఇలా..
నార్మల్ డయేరియా వచ్చినప్పుడు  లిక్విడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.  ఓఆర్‌‌ఎస్‌‌, ఎలక్ట్రాల్‌‌ పొడి కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం లాంటివి తాగితే శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి పొందొచ్చు. అయితే ఒకేసారి కాకుండా అప్పుడప్పుడు ఒక్కోగ్లాసు తాగడం మంచిది. వాంతులు, విరేచనాలతో బాధపడేవాళ్లు తేలికగా అరిగే వాటిని తినాలి. పాల పదార్థాలు తగ్గించాలి. పండ్లరసాలు, సూప్‌‌లు ఎక్కువగా తీసుకోవాలి. పుల్లటి పండ్లు తినొద్దు. విరేచనాలు తగ్గిన తర్వాత కూడా మూడు రోజుల వరకు తేలికపాటి ఫుడ్​ తీసుకోవడం మంచిది. విరేచనాలు తగ్గకపోయినా, జ్వరం ఎక్కువ అయినా వెంటనే డాక్టర్‌‌‌‌ను కలవాలి.

పిల్లలు జాగ్రత్త
అయిదేండ్ల లోపు పిల్లలకు డయేరియా సోకితే ఒక్కోసారి డీహైడ్రేషన్‌‌ ఎక్కువై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లలకు డయేరియా సోకితే సొంత వైద్యానికి బదులు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డీహైడ్రేషన్ ఎక్కువైతే డాక్టర్లు ఐవీ లైన్ ద్వారా ఫ్లూయిడ్స్ ఇస్తారు. అలాగే అవసరాన్ని బట్టి జింక్, విటమిన్–ఎ సప్లిమెంట్స్ అందిస్తారు. దీనివల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తపడొచ్చు. అలాగే పిల్లలకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేయించడం ద్వారా డయేరియా ప్రమాదాన్ని తగ్గించొచ్చు. రెండేండ్లు వచ్చే వరకూ పిల్లలకు తల్లిపాలే ఇస్తూ ఉంటే వాళ్లలో ఇమ్యూనిటీ పెరుగుతుంది.

రాకుండా ఉండాలంటే..
డయేరియా బారిన పడకుండా ఉండేందుకు వ్యక్తిగత శుభ్రత పాటించడం ఒక్కటే దారి. భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత  సబ్బు, గోరు వెచ్చని నీళ్లతో చేతులు కడుక్కోవాలి. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీళ్లు లేదా ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగాలి. చేతి గోళ్లు పెంచుకోవద్దు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. తినేవాటిపైన ఈగలు వాలకుండా మూతలు పెట్టాలి. ఇంటి చుట్టూ మురికినీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. బయట ఫుడ్ తగ్గించాలి. తేలికగా అరిగే వాటిని తినాలి. పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. – డా. ఎన్​.వై. ప్రశాంత్ చంద్ర, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్.