గరగర గొంతుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

గరగర గొంతుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

నోటిలో నుంచి ఒక శబ్దం బయటకు రావడం అంత మామూలు విషయమేమి కాదు.  ఊపిరితిత్తుల దగ్గర్నుంచి.. శ్వాసనాళం, స్వరపేటిక, స్వరతంత్రులు, నాడులు, నాలుక, పెదవులు, ముక్కు ఇవన్నీ కలిసికట్టుగా పనిచేస్తేనే మాట్లాడటం సాధ్యమవుతుంది.ఊపిరితిత్తుల నుంచి వచ్చే గాలి శ్వాసనాళం గుండా ప్రవహిస్తూ.. స్వరపేటికకు చేరుకొని.. ముక్కు, గొంతు ద్వారా బయటకు వస్తుంది. ఈ క్రమంలో స్వరపేటికలోని స్వరతంత్రులు కంపించినపుడు శబ్దం, మాట పుట్టుకొస్తాయి.  ఇలా గొంతులో నుంచి వచ్చే మాట చాలా అవయవాలతో ముడిపడిన వ్యవహారం
కాబట్టి వీటిలో ఎక్కడ సమస్య వచ్చినా అది గొంతు సమస్యగానే  పరిగణించొచ్చు. అందుకే ముందుజాగ్తత్త అవసరం అంటున్నారు డాక్టర్​సాగర్

ఏమేమి సమస్యలు

‘‘గొంతుకి వచ్చే సమస్యల్లో.. గొంతు బొంగురుపోవడం తరచుగా వచ్చే సమస్య. గట్టిగా మాట్లాడటం, అరవడం  వల్ల స్వరతంత్రులు ఒకదాంతో మరోటి గట్టిగా రాసుకుపోయి ఈ సమస్య వస్తుంది.  వైరస్, ఎలర్జీ కారణంగా కూడా  ఇది వ్యాపిస్తుంది. అయితే,  గొంతుకి విశ్రాంతి, ఆవిరి పీల్చడం(స్టీమింగ్) లాంటివి చేస్తే ఒక వారంలో సమస్య తగ్గిపోతుంది. అలా కాకుండా, రెండు వారాలు దాటినా  గొంతు బొంగురు  తగ్గకపోతే  దాని గురించి శ్రద్ధ వహించాలి.

గొంతు సమస్యల్లో మరొకటి స్వరపేటిక,  టాన్సిల్స్‌‌ వాపు వంటి ఇన్‌‌ఫెక్షన్లు. ఇవి కొన్నిసార్లు స్వరపేటికకూ విస్తరించొచ్చు. దీంతో స్వరతంత్రులు వాచి, ఎర్రబడతాయి. రెండు మూడు రోజులు ఎక్కువగా మాట్లాడకుండా చూసుకుంటే తగ్గిపోతుంది. యాంటీబయాటిక్‌‌ మందులు ఎక్కువగా వాడటం వల్ల  ఫంగల్‌‌ ఇన్‌‌ఫెక్షన్‌‌ వస్తుంది. ఆస్తమాకు వాడే  ఇన్‌‌హేలర్ల వల్ల కూడా ఇది రావొచ్చు. అందుకే ఇన్‌‌హేలర్‌‌ వాడాక గొంతులో నీటిని పోసుకొని పుక్కిలించడం మంచిది.

మిగతా భాగాల్లో లాగానే స్వరపేటికకూ క్యాన్సర్‌‌ వస్తుంది. ఇది స్వరతంత్రుల పైన, కింద, మీద ఎక్కడైనా తలెత్తొచ్చు. స్వరతంత్రుల మీద కణితులు ఏర్పడితే మాట వెంటనే మారిపోతుంది.  అందుకే  రెండు, మూడు వారాలు దాటినా మాట కుదురుకోకపోతే వెంటనే డాక్టర్‌‌‌‌ను సంప్రదించి, స్వరపేటికను పరీక్షించుకోవాలి.

ఎలా వస్తాయి?

వేసవిలో వచ్చే గొంతు సమస్యలకు ప్రధాన కారణం  పదే పదే చల్లనీళ్లు తాగడం. కూల్ డ్రింక్స్, ఐస్‌‌క్రీములు ఎక్కువగా తీసుకోవడం. దీని వల్ల గొంతులో గరగర, గొంతు నొప్పి, గొంతు బొంగురుపోవడం జరుగుతుంటుంది.  అయితే గొంతు సమస్యలు అక్కడే ఆగిపోకుండా కాస్త విస్తరించి, సైనసైటిస్‌‌, టాన్సిలైటిస్‌‌ సమస్యలతో పాటు, శ్వాసకోశాల ఇన్‌‌ఫెక్షన్లకు కూడా  దారి తీసే ప్రమాదం ఉంది.

వేసవిలో శరీరంలో  నీటి శాతం తగ్గి డీహైడ్రేట్ అవుతుంటుంది. అయితే,  దీని ప్రభావం గొంతుమీద కూడా పడుతుంది. గొంతులో ఉండే  వోకల్ కార్డ్స్ అతి సున్నితంగా, తేమను కలిగి  ఉంటాయి. తగినంత నీళ్లు లేకపోతే ఆ వోకల్ కార్డ్స్ పొడిబారతాయి. గొంతులో ఉండే ద్రవాలు కూడా తగ్గిపోతాయి. దీని వల్ల కూడా మాట మారిపోతుంది.

ఇకపోతే.. సమ్మర్ వెకేషన్‌‌లో అమ్యూజ్‌‌మెంట్ పార్కులకు వెళ్తుంటారు. అక్కడ వాటర్ గేమ్స్, స్విమ్మింగ్  లాంటివి చేస్తారు. కలుషితమైన నీళ్లలో స్విమ్మింగ్ చేయడంవల్ల  నీళ్లు ముక్కులోకి  పోయి గొంతు ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. వేసవిలో బ్యాక్టీరియల్  అలెర్జీలు త్వరగా వ్యాపిస్తుంటాయి.  దాంతో పాటు ఉత్సాహంతో పెద్దగా కేకలు వేస్తుంటారు. దాని వల్ల కూడా  గొంతు పోయే అవకాశం ఉంటుంది.

సమ్మర్‌‌‌‌లో  ఎక్కువసేపు  ఏసీలో ఉండడం వల్ల కూడా గొంతు బొంగురు పోతుంటుంది. ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారి పోతుంది.  తలుపులు మూసి ఉన్న సెంట్రలైజ్డ్ ఏసీలో పనిచేయడంవల్ల గొంతు ఎలర్జీల బారిన పడే అవకాశం ఎక్కువ. విపరీతమైన తలనొప్పి, కళ్ల దురద రావడం, న్యుమోనియా బారిన పడడం లాంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఏం చేయాలి

  • గొంతు సమస్య ఎలాంటిదైనా విశ్రాంతి కీలకం.  ఇన్‌‌ఫెక్షన్ల వంటివాటితో మాట మారిపోతే చాలావరకు విశ్రాంతి తోనే కుదురుకుంటుంది. కొద్దిరోజులు ఎక్కువగా మాట్లాడకుండా చూసుకుంటే చాలు.
  • ఇక కొన్ని  ఇన్‌‌ఫెక్షన్లకి ఆవిరి పట్టటం మేలు చేస్తుంది. వేడి నీటిలో యూకలిప్టస్‌‌ నూనె వేసుకొని ఆవిరి పడితే మంచిది. రోజుకు కనీసం నాలుగు లీటర్ల  నీళ్లు తాగటం మంచిది. మాటిమాటికీ గొంతు తడుపుతూ ఉండాలి. ఫ్రిజ్‌‌లో ఉంచడం వల్ల బాగా చల్లబడిన, గడ్డకట్టిన ద్రవ పదార్థాలను తీసుకోవడం,
  • తాగే నీళ్లల్లో ఐస్‌‌గడ్డలు వేసుకొని తాగటం అంత  మంచిది కాదు.  అప్పుడప్పుడు వేడి నీళ్లతో స్నానం, గోరువెచ్చని నీటిని తాగడం కూడా చేస్తుండాలికొంత మంది మాటిమాటికీ గొంతు  సవరించుకుంటారు. తరచూ గొంతు సవరించడం వల్ల  స్వరతంత్రులు ఒకదాంతో మరోటి రాసుకుపోయే ప్రమాదముంది. కాబట్టి ఆ అలవాటు మానుకోవాలి.
  • గుసగుసలు పెట్టటం మంచిది కాదు. గుసగుసలు పెడితే స్వరతంత్రులు మరింత ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది.వేసవిలో సాధ్యమైనంతవరకు మద్యం, కాఫీ, టీలు తాగకపోవటం మేలు. పొగతాగే అలవాటుంటే వెంటనే  దాన్ని మానెయ్యాలి. పొగ, దుమ్ము, ధూళితో కూడిన వాతావరణాలు గొంతు ఇన్ఫెక్షన్లను త్వరగా వ్యాపింపజేస్తాయి.
  • అలర్జీ మందులతో స్వరపేటిక పొడిబారొచ్చు. కాబట్టి వీటిని అవసరమైతేనే వాడుకోవాలి. అలాగే రోజూ పొద్దున్నే ఉప్పు నీళ్ళతో పుక్కిట పడితే గొంతు బొంగురు నుంచి రిలీఫ్ లభిస్తుంది.” అని చెప్పారాయన.