మగాళ్లకు ప్రెగ్నెన్సీ ఛాలెంజ్

మగాళ్లకు ప్రెగ్నెన్సీ ఛాలెంజ్

అవతలి వాళ్లకు సలహాలివ్వడం చాలా తేలికైన విషయం. కానీ, ఆ కష్టం తనదాకా వస్తేగానీ తెలియదని పెద్దలు అంటుంటారు.  జపాన్‌‌లో రాజకీయ నాయకులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  ఒకవైపు గర్భవతులు విశ్రాంతి దొరక్క తంటాలు పడుతుంటే.. అక్కడి రాజకీయ నాయకులు మాత్రం వాళ్లపై సెటైర్లు వేస్తున్నారు.  అయితే గర్భాన్ని మోయడం ఎంత కష్టమో ఆ లీడర్లకు తెలిసొచ్చేలా చేసిన ప్రయత్నం గురించి ప్రపంచమంతా ఆసక్తిగా చర్చించుకుంటోంది.

వారం క్రితం..  జపాన్‌‌లో రూలింగ్‌‌ పార్టీకి చెందిన ముగ్గురు యంగ్‌‌ లీడర్లు.. బరువైన జాకెట్లు వేసుకుని రెండు రోజులపాటు గడిపారు.  బ్రెస్ట్‌‌, బెల్లీ షేప్స్‌‌తో తయారు చేసిన ఆ జాకెట్ల బరువు ఏడున్నర కిలోల దాకా ఉంది. ఈ జాకెట్‌‌ వేసుకునే ఇంట్లో పనులు చేశారు. షాపింగ్‌‌కి వెళ్లారు. పడుకునే టైంలోనూ జాకెట్లు వేసుకునే ఉన్నారు. కేవలం పార్లమెంట్ ప్లీనరీ సెషన్స్‌‌లో మాత్రమే ఆ జాకెట్లను తీసేందుకు వాళ్లకు పర్మిషన్‌‌ దొరికింది.  ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్లు పడే కష్టం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే వాళ్లు ఈ ప్రయత్నం చేశారు.  అయితే ఈ బుద్ధి వాళ్లకు పుట్టింది మాత్రం కాదు. టకాకో సుజికి అనే పార్లమెంటేరియన్‌‌ ఈ ప్రెగ్నెన్సీ ఛాలెంజ్‌‌ను వాళ్లకు విసిరింది. 

వేధింపులు కూడా!

జపాన్‌‌లో మెటర్నిటీ లీవ్‌‌లు ఎక్కువ రోజులు ఇవ్వరు. నెలలు నిండినా కూడా ఆడవాళ్లు ఆఫీసులకు, పనులకు వెళ్లాల్సిందే. పైగా వర్క్‌‌ ప్లేసుల్లో లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొంటున్నారు(ఈ వేధింపులకు ‘మాటాహర’ అని పేరు పెట్టారు).  ఆరోగ్యం గురించి పట్టించుకోకపోవడం, పని ఒత్తిడిలో అలసిపోవడం, మానసిక సమస్యలతో జపాన్‌‌లో అబార్షన్‌‌ కేసులు పెరిగిపోతున్నాయి.  దీంతో  మెటర్నిటీ లీవ్‌‌ సాధించేలా, వేధింపులకు అడ్డుకట్ట పడేలా కఠిన చట్టాలు చేసే దిశగా ప్రభుత్వం చట్టాలు చేయాలని కోరుతూ కొన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ఈ నిరసనలపై అధికారంలో ఉన్న లిబరల్‌‌ డెమొక్రటిక్‌‌ పార్టీ నేతలు కొందరు సెటైర్లు వేశారు. ఈ సెటైర్లు చూసి అధికార పక్షంలోనే ఉన్న టకాకో సుజుకికి కోపమొచ్చింది. తన పార్టీలోనే ఉన్న ముగ్గురు యంగ్ లీడర్లను  ప్రెగ్నెన్సీ ఛాలెంజ్‌‌ స్వీకరించాలని  సవాల్ చేసింది.
  
బాబోయ్‌‌.. వల్ల కాలేదట! 

మసనోబు ఒగుర, నోరికజు సుజుకి, తకషి ఫుజివార.. ముగ్గురు నలభై ఏళ్ల వయసు లోపువాళ్లే.  ఏప్రిల్ 8 నుంచి రెండు రోజులపాటు వీళ్లు ఈ ఛాలెంజ్‌‌లో పాల్గొన్నారు. స్పెషల్‌‌గా తయారు చేయించిన ప్రెగ్నెన్సీ జాకెట్లు వేసుకున్నారు. రెండో రోజు ముగిశాక, ఆ భారం మోయడంలో ఉన్న కష్టమేంటో తమకు తెలిసొచ్చిందని ‘సారీ’ చెప్పారు వాళ్లు. కూర్చోవడం, నిల్చోవడం, వెనక్కి తిరిగి చూడడం.. ఇలా ప్రతీది వాళ్లకు నరకంగా అనిపించిందట.  అంతేకాదు తాము పడ్డ ఇబ్బందులతో ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు వీళ్లు.  అయితే ‘‘ఈ ఛాలెంజ్‌‌ గర్భం మోయడంతో సమానం కాకపోయినా.. గర్భవతుల కష్టాల్ని ఇప్పటికైనా ఆ లీడర్లు అర్థం చేసుకున్నందుకు సంతోషమ’’ని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. వేధింపులు, చైల్డ్ కేర్‌‌తో పాటు ఆడా మగా తేడా చూడకుండా వీలు కల్పించే చట్టాలకు ఇకనైనా మద్దతివ్వాలని వాళ్లను కోరుతున్నారు మరికొందరు.