ఆసుపత్రికి తాళం..వరండాలోనే గర్భిణి ప్రసవం

ఆసుపత్రికి  తాళం..వరండాలోనే గర్భిణి  ప్రసవం

 వెల్దుర్తి, వెలుగు :  అర్ధరాత్రి పురిటి నొప్పులతో పీహెచ్​సీకి వస్తే తాళం వేసి ఉండడంతో ఓ గర్భిణి వరండాలోనే ప్రసవించింది. ఈ సంఘటన మెదక్​ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో జరిగింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన గర్భిణి తాటి సృజనకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్థానిక పీహెచ్​సీకి తీసుకెళ్లారు. డ్యూటీలో వైద్యసిబ్బంది ఎవరూ లేకపోగా, దవాఖానాకు తాళం వేసి ఉంది. దీంతో చాలా సేపు ప్రసవ వేదన అనుభవించిన సృజన దవాఖాన వరండాలోనే  పాపకు జన్మనిచ్చింది.  ఆదివారం రాత్రి డ్యూటీలో ఉన్న నర్సు జయంతి హాస్పిటల్​లో ఉండకుండా ఫ్రెండ్​ ఇంట్లో నిద్రపోయినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం మూడు గంటల వరకు కూడా డాక్టర్ పీహెచ్​సీకి రాలేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎంహెచ్​వో చందునాయక్​ వివరణ కోరగా వెల్దుర్తి పీహెచ్​సీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన నర్సు జయంతికి  మెమో ఇచ్చామని తెలిపారు. ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.