తలసేమియాను తరిమేద్దాం

తలసేమియాను తరిమేద్దాం

మహబూబ్​నగర్​/మహబూబ్​నగర్​ రూరల్​, వెలుగు : గర్భిణులకు ప్రాణంతకంగా మారుతున్న  తలసేమియాను అరికట్టేందుకు ఆరోగ్య కార్యకర్తలందరూ కృషి చేయాలని పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ పిలుపునిచ్చారు.  గర్భిణులు మిగతా పరీక్షలతో పాటు తలసేమియా టెస్టు కూడా చేయించుకోవాలని సూచించారు. గురువారం మహబూబ్​నగర్ జడ్పీ మీటింగ్‌‌ హాల్‌‌లో తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో గర్భిణులకు తలసేమియా హెచ్‌‌బీఏ 2 పరీక్షలపై ఆరోగ్య కార్యకర్తలు, అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్యు పరమైన ఇబ్బందులు తలెత్తకుండా గర్భిణులందరూ హెచ్ బీఎ2 టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఈ పరీక్ష ద్వారా వంద శాతం తలసేమియా నివారణ సాధ్యమన్నారు. 

అభివృద్ధి పనులు ప్రారంభం

జిల్లా కేంద్రంలోని ఏనుగొండ, వివేకానందనగర్​లో రూ.70 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు, పోచమ్మ కాలనీలో కొత్తగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం కాలనీలో పాదయాత్ర చేసి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా గృహ నిర్మాణాలు చేపట్టిన ద్వారకాపురి కాలనీలో అన్ని వసతులు కల్పించాలని స్థానికులు కోరగా.. వెంటనే అధికారులను పిలిపించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం మున్సిపల్​ కౌన్సిలర్లు,  పార్టీ వార్డ్ ఇన్‌‌ర్జులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఏ సమస్య వచ్చినా స్పందించాలని సూచించారు. 17న బీఆర్​ఎస్​ వార్డు ఇన్‌‌చార్జిల విస్తృత స్థాయి సమావేశాన్ని పట్టణంలోని జేజేఆర్ గార్డెన్స్​లో నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 

పేదింటి ఆడబిడ్డలకు అండగా కేసీఆర్

సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నామని మంత్రి శ్రీనివాస్​గౌడ్​ చెప్పారు.  మహబూబ్ నగర్ రూరల్​ మండల పరిషత్ మీటింగ్ హాల్‌‌లో 71 లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.  అనంతరం జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్​లో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను పరిశీలించారు. ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.  ఈ కార్యక్రమాల్లో ఎస్పీ వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, డీఎస్పీ మహేశ్, డీవైఎస్వో శ్రీనివాస్, బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.