గర్భిణీలు ఇలా వ్యాయామం చేయాలి

గర్భిణీలు ఇలా వ్యాయామం చేయాలి

ఊళ్లలో ఉండేవాళ్లు గర్భం వచ్చి ఆరు ఏడు నెలలు దాటినా పొలం పనులకు వెళతారు. కింద కూర్చొని బట్టలు ఉతుకుతారు. గిన్నెలు కడుగుతారు. అలా ఉండటం చాలా ఆరోగ్యమే. అంతేకాదు, ఎండలో పని చేయడం అందరికీ ఆరోగ్యమే. గర్భవతులకు ఇంకా ఆరోగ్యం. ఈ రోజుల్లో గర్భం వచ్చిన వెంటనే డాక్టర్లను సంప్రదిస్తున్నారు. వారి సూచనల మేరకు పని చేస్తే మంచిదే. కానీ అదే డాక్టర్‍ ఎక్కువ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి అని చెప్తే మాత్రం వాళ్లు ఎలాంటి పని చేయకపోవడమే మంచిది.

నగరాలలో ఉండేవాళ్లలో ఉద్యోగానికి వెళ్లేవాళ్లు కొంత మంది ఉంటారు. బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. వాళ్లు ప్రత్యేకించి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. కానీ సీట్లో ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వాళ్లు మాత్రం గంటకొకసారైనా చిన్నగా నడవాలి. కూర్చున్న చోటే ఉండిపోకూడదు.

ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే ఉండేవాళ్లు మాత్రం ఏడు, ఎనిమిది నెలలు వచ్చేంత వరకూ చిన్నపాటి వ్యాయామాలు చేయడం తప్పనిసరి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఒక సమయాన్ని పెట్టుకుని దగ్గర్లో ఉండే పార్క్ కి గాని, ఖాళీ ప్రదేశంలో కాని కొద్దిగా నడవాలి. వంగకుండా ఉండే చిన్న చిన్న పనుల్లాంటివి చెయ్యాలి. కానీ ఊళ్లో వాళ్లైనా, నగరాల్లో ఉండేవాళ్లయినా కామన్‍గా చేయకూడనివి మెట్లు ఎక్కడం, ఎక్కువసేపు వంగుని ఉండడం, గెంతడం, బరువులు ఎత్తడం. తినే ఆహారంలో నూనె పదార్థాలు ఎక్కువ లేకుండా పాలు, పండ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువ తీసుకుంటే మంచిది. ఇలా జాగ్రత్త పడకపోతే శరీరం కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువుంటుంది.