V6 News

‘ఆ ఒక్క నిర్ణయం మార్చుకుని ఉంటే.. ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది’ అని మీకెప్పుడైనా అనిపించిందా..?

‘ఆ ఒక్క నిర్ణయం మార్చుకుని ఉంటే.. ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది’ అని మీకెప్పుడైనా అనిపించిందా..?

పేరుకే ఇదొక ప్రేమకథ. కానీ ఈ పుస్తకం పూర్తిగా చదివితే గానీ కథ లోతు తెలియదు. ప్రేమను కేంద్రంగా చేసుకుని కాలం, జ్ఞాపకాలు, పశ్చాత్తాపం, తండ్రి ప్రేమ వంటి అంశాల్ని ఒకదానితో ఒకటి ముడిపెట్టి నడిపించిన నవల తాలూకు కథ. 1995 అనేది ట్యాగ్‌ లైన్ కాదు. ఆనాటిదని రుజువు చేయడానికి పెట్టింది కానే కాదు. అది మన బాల్యం నాటి రోజుల్ని, మధుర జ్ఞాపకాల్ని, పాత గాయాల్ని, చెప్పుకోని ప్రేమను మనసులోంచి వెలికి తీస్తుంది. 1995 నేపథ్యం చుట్టూ సాగే ఈ నవల ప్రేమకథలను ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది. 

కాలయానం వంటి ప్రత్యేక అంశాన్ని జోడించి, ఆసాంతం ఆసక్తిని పుట్టించే ఈ కథ చదువుతున్నప్పుడు మనమే1995 సంవత్సరంలోకి వెళ్లి కాలయానం చేశామా అని భావించేటట్లుగా చేస్తుంది. ఆ కథలోని పాత్రలు, సన్నివేశాలు మన కళ్లముందే జరుగుతున్నట్లనిపిస్తుంది. చాలా రకాల కథలు విన్నాం, చూశాం. రాబోయే కాలం ఎలా ఉంటుందోనని ఆలోచించడమే కానీ, గడిచిన కాలం ఎలా ఉంటుందో, ఎలా గడిచిపోయిందో ఎవరూ పట్టంచుకోరు. ఈ నవల ఆ క్షణాల్లోకి మళ్లీ వెళ్లేలా చేస్తుంది. అప్పటి సామాజిక పరిస్థితులు, రాజకీయాలను, మనుషులను మనకు చూపిస్తుంది. ప్రేమ అనేది ఏ బంధంలోనైనా ప్రత్యేకం. అటువంటిది ఆ కాలం కథకు ఒక తెలియని భావాన్ని అందిస్తుంది. అదే ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.

ఇకపోతే ఈ నవలలో ప్రధాన పాత్ర అజయ్. తనొక డిజైనర్‌. వృత్తిపరంగా పని ఎంత బాగా చేసినా సంతృప్తి చెందడు. ఇంట్లో నాన్న వైఖరికి మనశ్శాంతి ఉండదు. తన జీవితంలో ఏదో ఒక లోటు. తెలియని వెలితి. కట్ చేస్తే.. ఒకరోజు యూనివర్సిటీలో ఒక అమ్మాయి ఫొటోను చూసి ప్రేమలో పడటం. ఆమెను కనుక్కునే క్రమంలో టైం ట్రావెల్‌ చేయడం. తనలోని ప్రేమను అర్థం చేసుకోవాలనుకోవడం. వీలైతే తన తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకోవడం. ఇలా పరిపరి విధాల సంఘర్షణల్ని మనం చూడొచ్చు. ఈ కథలో కీర్తన అనే మరొక పాత్ర ప్రేమకి ప్రతిరూపం. ఆమె ఈ కథలో కీలకం. కీర్తన బలమైన వ్యక్తిత్వం ఆనాటి ఉన్నత విద్యావంతులైన స్త్రీలకు ఉదాహరణ. కీర్తన ప్రేమ ఆర్భాటపు ప్రేమ కాదు. ఎదురుచూపులతో కూడిన ప్రేమ. కీర్తనలో మనం చూసేది సహనం. ప్రేమకు సహనం ఎంత అవసరమో ఈ పాత్ర చక్కగా చూపిస్తుంది. అటువంటి ప్రేమ దూరంగా ఉన్నా భారమవ్వదు.

వాస్తవానికి అజయ్, కీర్తనల ప్రేమకథే ఈ పుస్తకానికి ఊపిరి. ఒకరిపై ప్రేమ ఉండటం వేరు. ఆ ప్రేమని నిలబెట్టుకోవడం వేరు. రెండు తరాల మధ్య భిన్నాభిప్రాయాలు సంఘర్షణలు ఉండటం ఆ ప్రేమకు సవాలు అయింది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మధ్య 30 సంవత్సరాల గ్యాప్ ఉంది. అలా ప్రేమని నిలబెట్టుకోవడంలో వచ్చే కష్టాలను ఇందులో చూస్తాం. ప్రేమలో ఆశ, భయం, నమ్మకం, పశ్చాత్తాపం ఉంటాయి. వీరిద్దరి బంధం ఈ భావాల గాఢతను మోస్తూ ముందుకుసాగుతుంది. అందుకే మనం కేవలం కథను చదవడమే కాదు. భావాలను ఫీల్ అవుతాం. ఈ కథలో కాలం మారడం వల్ల పాత్రలు కూడా మారతాయి. జీవితం మారుతుంది. మనసులు మారుతాయి. కానీ మారని ఒకే విషయం ప్రేమ.

కాలయానం అనేది ఈ నవలలో కీలక ఘట్టం.. గతం మారిస్తే జీవితం మారుతుందా ?

‘ఒక్కసారి ఆ రోజుకు వెళ్లి ఉంటే... నేను అలా మాట్లాడకుండా ఉండేవాడిని’ ‘నా జీవితంలో ఆ ఒక్క నిర్ణయం మార్చుకుని ఉంటే.. ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేది’ అని ఎన్నోసార్లు అనిపిస్తుంది. అటువంటి భావాన్ని కథగా మార్చి చెప్తుందీ పుస్తకం. నిజానికి గతాన్ని మార్చగలిగే శక్తి మనకు లేదు.. ఉన్నా మనం ప్రశాంతంగా ఉండలేం? ఇలాంటి సందేహాల్ని రేకెత్తిస్తూ.. ఇప్పుడు ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠను పెంచుతుంది.

మొత్తానికి ‘ప్రేమమ్ - కాలయానం(1995)’ కాలం వేరైనా ప్రేమ మాత్రం ఒకటే అని చెబుతోంది. అపార్థాల వల్ల అజయ్ తన నాన్న ప్రేమకు దూరమవుతాడు. తర్వాత వాటన్నింటిని దాటుకుని తిరిగి నాన్న ప్రేమను పొందుతాడు. ప్రేమ, కుటుంబ బంధాలు, సైన్స్, టైమ్ ట్రావెల్, థ్రిల్లింగ్ అంశాల చుట్టూ నడిచే ఈ నవలను మొదలుపెడితే పూర్తిగా చదివేవరకు వదలరు!

  • పుస్తకం: ప్రేమమ్​ కాలయానమ్-​‌‌1995
  • ధర : రూ.220
  • రచయిత: చరణ్​ పరిమి
  • ప్రతులకు : అమెజాన్‌లో..
  • మొబైల్​: 8985095040

పి. రాజ్యలక్ష్మి

  • లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com