జామ తోటలో డ్రగ్స్ తయారీ .. ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు

జామ తోటలో డ్రగ్స్ తయారీ ..  ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు
  • గుట్టురట్టు చేసిన యాంటీ నార్కోటిక్​ టీమ్
  • సంగారెడ్డి జిల్లాలో 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్ పట్టివేత
  • ఐదుగురు అరెస్ట్.. పరారీలో మరో ఇద్దరు 

జిన్నారం, వెలుగు: గుట్టుచప్పుడు కాకుండా జామ తోటలో నిర్వహిస్తున్న డ్రగ్స్​తయారీ కేంద్రాన్ని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా యాంటీ నార్కోటిక్ టీమ్, జిన్నారం పోలీసులు చేసిన జాయింట్​ఆపరేషన్​లో 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్ దొరికింది. ఎస్పీ చెన్నూరు రూపేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిన్నారం మండలం కొడకంచి గ్రామ సమీపంలోని జామ తోటలో నాలుగు నెలలుగా కొందరు నార్డాజపం అనే నార్కోటిక్ డ్రగ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ విషయం గత బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్ డ్రగ్ సెల్​కు తెలిసింది. అదే రోజు రాత్రి జిన్నారం పోలీసులతో కలిసి సంగారెడ్డి జిల్లా యాంటీ నార్కోటిక్​టీమ్ డ్రగ్స్ తయారీ యూనిట్​పై దాడి చేసింది. 

ఈజీగా డబ్బు సంపాదించేందుకు మహమ్మద్ యూనిస్, గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, కిష్టంగారి నిర్మల్ గౌడ్, పసుపులేటి మాణిక్యాలరావు, కృష్ణంగారి శివశంకర్ గౌడ్ అనే ఐదుగురు డ్రగ్స్ తయారుచేస్తున్నట్లు గుర్తించింది. వారిని అదుపులోకి తీసుకుంది. యూనిట్​లోని 14 కిలోల అల్ప్రాజోలం పౌడర్​ను సీజ్ చేసినట్టు ఎస్పీ రూపేశ్ తెలిపారు. రాహుల్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ అనే ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. డ్రగ్స్ తయారీలో మరెవరైనా ఉన్నారా? తయారు చేసిన డ్రగ్స్ ను ఎవరికి, ఎలా విక్రయిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. 

పట్టుబడ్డ డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. నిందితులు 4 నెలల కింద కొడకంచి శివారులో మూడు ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకున్నారు. సరిగ్గా జామతోట మధ్యలో డ్రగ్స్ తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సైలంట్​గా నార్డాజపం అనే డ్రగ్​ను తయారుచేస్తున్నారు. జాయింట్ ఆపరేషన్​లో పటాన్ చెరు డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, జిన్నారం సీఐ ఎం.వేణుకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.