రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం

రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం

జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొత్త శకటాలు, సైన్యం ఆయుధాలను ప్రదర్శించి, వాటిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చూపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది లక్షలాది మంది ఈ వేడుకలను నేరుగా తిలకిస్తుండగా…ఈ ఏడాది మాత్రం కేవలం 25 వేల మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. సీఆర్పీఎఫ్ కమాండోల ఆధ్వర్యంలో జరిగే మోటార్ సైకిల్ విన్యాసాలను కూడా ప్రదర్శించడం లేదు.

ఫ్రాన్స్ నుంచి ఇండియా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు మొదటి సారిగా పరేడ్ లో భాగం కానున్నాయి. గతేడాది సెప్టెంబర్ లో ఈ విమానాలు భారత వాయుసేనలో చేరాయి. రిపబ్లిక్ డే  రోజున రాఫెల్ యుద్ధ విమానంతో ‘వర్టికల్ ఛార్లీ’ ఫార్మేషన్ ను చేయనున్నారని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రతినిధి వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది తెలిపారు. ఒక రాఫెల్ యుద్ధ విమానం లీడ్ తీసుకుని రెండు జాగ్వార్, రెండు మిగ్-29 ఫైటర్లతో కలిసి ఏకలవ్య ఫార్మేషన్ ను చేసి చూపించనుంది.

మరోవైపు తొలి మహిళా ఫైటర్ విమానాల పైలెట్ భావనా కాంత్ ఈ ప్రదర్శనలో భాగం పంచుకోనున్నారు. పలు రకాల తేలికపాటి యుద్ధ విమానాలతో పాటు సుఖోయ్-30 జెట్లు కూడా కనువిందు చేయనున్నాయి.

రిపబ్లిక్ వేడుకల్లో శకటాల ప్రధర్శనలో లేహ్ లో భాగమైన థిక్సే కొండలపై ఓ పర్యాటక కేంద్రంగా ఉన్న చారిత్రక మఠం నమూనా తొలిసారిగా ప్రదర్శనలో ఉండనుంది. యూపీలో నిర్మిస్తున్న రామాలయం నమూనా, ఏపీకి సంబంధించి లేపాక్షీ థీమ్ తో శకటం ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. భారత నావికాదళం నుంచి 1971లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నమూనా శకటం రానుంది.