డబ్ల్యూటీసీ 2కు రంగం సిద్ధం

డబ్ల్యూటీసీ 2కు రంగం సిద్ధం
  • పాయింట్ల లెక్క పక్కాగా
  • ఇండియా, ఇంగ్లండ్​ సిరీస్​తో డబ్ల్యూటీసీ-2 షురూ 
  • గెలిస్తే 12, డ్రాకు 4, టై అయితే 6 పాయింట్లు
  • రెండేళ్ల వ్యవధిలో 19 టెస్ట్‌‌‌‌లు ఆడనున్న టీమిండియా

దుబాయ్: ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ)–2కు రంగం సిద్ధమైంది. 2021 నుంచి 2023 వరకు.. రెండేళ్ల పాటు ఈ సైకిల్ సాగనుంది. ఆగస్ట్ 4 నుంచి ఇండియా, ఇంగ్లండ్ మధ్య ప్రారంభమయ్యే  ఐదు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్‌‌‌‌ సిరీస్‌‌‌‌తో డబ్ల్యూటీసీ–2కి తెరలేవనుంది. ఆ తర్వాత డిసెంబర్‌‌‌‌లో జరిగే యాషెస్ సిరీస్ (5 టెస్టులు)తో చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌కు ఊపు రానుంది. అయితే డబ్ల్యూటీసీలో ఈ రెండు సిరీస్‌‌‌‌లు మాత్రమే ఐదు టెస్టులు ఉంటాయి. ఈ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో ఇండియా.. న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్‌‌‌‌లకు ఆతిథ్యమివ్వనుండగా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌‌‌‌తో అక్కడ సిరీస్‌‌‌‌లు ఆడుతుంది. ఆగస్టులో మొదలయ్యే డబ్ల్యూటీసీ–2.. 2023 జూన్​లో జరిగే ఫైనల్‌‌‌‌తో ముగుస్తుంది.  ఫైనల్​ మ్యాచ్​ జరిగే వెన్యూ ఇంకా ప్రకటించలేదు. 2022 ఆసీస్​ టూర్​లో ఇండియా నాలుగు టెస్టులు ఆడుతుంది. ఇది కాక.. ఇండియా మూడు మ్యాచ్‌‌‌‌ల టెస్ట్ సిరీస్‌‌‌‌లు ఏడు, రెండు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లు పదమూడు ఆడుతుంది. 

పాయింట్స్ సిస్టమ్ మారింది..
డబ్ల్యూటీసీ–1లో ప్రతి సిరీస్‌‌‌‌కు 120 పాయింట్లు కేటాయించడంతో ఫ్యాన్స్, టీమ్స్ చాలా గందరగోళానికి గురయ్యారు. దీంతో డబ్ల్యూటీసీ–2లో పాయింట్ల సిస్టమ్‌‌‌‌ను మార్చేశారు. గెలిచిన ప్రతి మ్యాచ్‌‌‌‌కు 12 పాయింట్లు కేటాయిస్తారు. డ్రా చేసుకుంటే 4 పాయింట్లు, టై అయితే 6 పాయింట్లు ఇస్తారు. సిరీస్‌‌‌‌లో ఎన్ని మ్యాచ్‌‌‌‌లనేది ఇక్కడ లెక్కలోకి రాదు. ఈ పాయింట్లను బట్టే స్టాండింగ్స్‌‌‌‌ తీస్తారు. డబ్ల్యూటీసీ–1లో ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ (పీవోపీ) సిస్టమ్‌‌‌‌లోనూ  చిన్న  చిన్న మార్పులు చేశారు. ఆడిన సిరీస్‌‌‌‌లను బేస్ చేసుకుని గతంలో  (డబ్ల్యూటీసీ–1) పర్సంటేజ్ లెక్కిస్తే.. ఈ సారి ఆడిన మ్యాచ్‌‌‌‌లను  బేస్ చేసుకుని పాయింట్లను  లెక్కించనున్నారు. ఉదాహరణకు కొత్త సైకిల్ ప్రకారం ఇంగ్లండ్ 21 మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. అన్ని మ్యాచ్‌‌‌‌ల్లో గెలిస్తే  ఇంగ్లిష్ టీమ్‌‌‌‌కు 252 పాయింట్లు లభిస్తాయి. దీంతో ఆడిన మ్యాచ్‌‌‌‌లు, టీమ్ సాధించిన పాయింట్లను బట్టి పర్సెంటేజ్ తీసి ర్యాంకింగ్స్ కేటాయిస్తారు. 

టీమ్ ఎన్ని మ్యాచ్లు..
డబ్ల్యూటీసీ–2లో ఇంగ్లండ్ అందరికంటే ఎక్కువగా 21 మ్యాచ్‌‌‌‌లు ఆడుతుంది. ఆ తర్వాత ఇండియా 19 టెస్టులు  ఆడనుంది. తర్వాత ఆస్ట్రేలియా (18), సౌతాఫ్రికా (15), బంగ్లాదేశ్ (12), న్యూజిలాండ్ (13) ఉన్నాయి. వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్ తలా 13 టెస్టులు ఆడనున్నాయి. డబ్ల్యూటీసీ–1 మాదిరిగానే ఈసారీ 9 టెస్ట్ జట్లు ఆరు సిరీస్‌‌‌‌ల్లో తలపడతాయి. విదేశాల్లో 3, స్వదేశంలో 3 సిరీస్‌‌‌‌లు ఆడతాయి. ఎక్కువ టెస్టులున్న సిరీస్లు ఆడే జట్లు ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మాత్రమే. మిగతా ఆరు టీమ్స్‌‌‌‌ గరిష్టంగా 3 లేదా 2 టెస్టుల సిరీస్‌‌‌‌లే ఆడనున్నాయి.