భారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలు ఇస్తుంది

భారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలు ఇస్తుంది

న్యూఢిల్లీ: ఐదేళ్ల పదవీ కాలం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. రాష్ట్రపతి హోదాలో జాతినుద్దేశించి రామ్ నాథ్ కోవింద్ వీడ్కోలు ప్రసంగం చేశారు . దేశ ప్రజలే నిజమైన జాతి నిర్మాతలన్నారు. ఐదేళ్ల పదవీకాలంలో దేశంలోని అన్ని వర్గాల ప్రజలను కలిశానని తెలిపారు. యువత చేతిలో భావి భారత నిర్మాణం భద్రంగా ఉంటుందన్న ఆయన... యువత అందుకోసం కృషి చేయాలని సూచించారు. గాంధీజీ సిద్ధాంతాలను పాటించాలని యువతను కోరారు. తాను సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, భారత ప్రజాస్వామ్యం అందరికీ అవకాశాలు ఇస్తుందని స్పష్టం చేశారు.  పర్యావరణాన్ని అందరూ విధిగా కాపాడుకోవాలని కోరారు. 

కాగా... భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము  రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సహా పలు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, పార్లమెంట్ సభ్యులు పాల్గొననున్నారు.