లెటర్​ టు ఎడిటర్​: ఒక్క రుణ మాఫీ..అమాంతం పెరిగిన సర్కార్ ప్రతిష్ట

 లెటర్​ టు ఎడిటర్​: ఒక్క రుణ మాఫీ..అమాంతం పెరిగిన సర్కార్ ప్రతిష్ట

ఒక్క కుండపోత వర్షంతో కరువంతా కొట్టుకుపోయినట్టు.. ఒక్క ఉపా యంతో అష్ట దరిద్రాలూ దూరమైనట్లు..ఒకే ఒక్క రుణ మాఫీతో రైతుల ఈతి ఇక్కట్లకు తెరపడి ఆ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ట అమాంతం పెరిగింది. ఎక్కడేమి లోపం దొరుకుతుందాని, సందు దొరికితే అడ్డంగా పాపుదామని కాచుక్కూర్చున్న బాపతులు తట్టా బుట్టా సర్దుకుంటారు. ఉన్నపళంగా సర్కారు కూలుతుందని, ఆగస్టు సంక్షోభమనే గొంతెమ్మ కోరికలకు గుణపాఠం కాగలదు.  ప్రభుత్వం పడిపోవడం అటుంచి, వచ్చే సాధారణ ఎన్నికలలోనూ హస్తం పార్టీ రెన్యువల్ లాంఛనమే అనేంత సానుకూలత  కనిపిస్తోంది. సవాలక్ష సందేహాలు వ్యాప్తి చేస్తూ, పూటకో అపశకునం మాటతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థిరత్వం, విశ్వసనీయతను పొట్టనబెట్టుకునే చౌక ఎత్తుగడలకు ఖరీదైన శాస్తి జరుగుతుంది.

 ఒకవేళ అత్యాశ, పేరాశ చావనోళ్ళు ఏదో మూలన నక్కి ఉంటే.. తెలంగాణ యావత్ లాభిత రైతాంగం, వ్యవసాయ అనుబంధ రంగాల బలగం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుకు రక్షా కవచంగా నిలుస్తుంది. ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రజానీకమే కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అట్లా రెట్టించిన కృతజ్ఞత చూపుతుంది. కోట్లాది కుటుంబాల కాంగ్రెస్ అనుకూల మనసెరిగి..తోక ముడవక తప్పని స్థితి సదరు విలనిజం వ్యక్తులకు అనివార్యమే. 

ఒకే ఒక్క రైతు రుణ మాఫీ అంతటి పవర్ ఫుల్ మరి! దేశంలోని తక్కిన 28 రాష్ట్రాలలో ఏ ఒక్క ప్రభుత్వానికీ దక్కనంత ఘనత, పలుకుబడి, విశ్వసనీయత తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనకు, కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఎందుకంటే, ఏ స్టేట్​లోనూ ఏకంగా రూ. 2 లక్షల చొప్పున భారీ మొత్తంలో రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేసిన దాఖలాలు లేవు. తెలంగాణే ఈ అంశంలో సరికొత్త రికార్డు, కొంగొత్త సంచలనానికి చిరునామాగా నాంది పలుకుతుంది.  స్వామినాథన్ సహా ఎందరో వ్యవ సాయ ప్రేమికులు, తపస్వికుల కల ఓవరాల్ గా నెరవేరుతుంది. కర్షకుల కష్టాలు మూలాల్లోంచి దూరమై, బాకీల బాధలు వేదనలు తీరుతాయి. 

- ఇల్లెందుల దుర్గాప్రసాద్, 
సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్