మరో 6 రోజుల్లో ఐపీఎల్‌‌.. మళ్లీ అవుతారా చాంపియన్స్.. రెండో టైటిల్ వేటలో గుజరాత్, రాజస్తాన్

మరో 6 రోజుల్లో ఐపీఎల్‌‌.. మళ్లీ అవుతారా చాంపియన్స్.. రెండో టైటిల్ వేటలో గుజరాత్, రాజస్తాన్

(వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌)

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌లో అరంగేట్రం చేసిన తొలి ఏడాదిలోనే చాంపియన్ గా నిలిచిన జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ). శుభ్‌‌మన్ గిల్ కెప్టెన్సీలో గత సీజన్‌‌లో టాప్-2 దిశగా దూసుకెళ్లిన ఈ జట్టు చివరి నిమిషంలో తడబడి మూడో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో 2022లో అద్భుత విజయంతో టైటిల్ నెగ్గిన ఆ జట్టు.. ఇప్పుడు మళ్ళీ మునుపటి ఫామ్ అందుకొని రెండోసారి చాంపియన్ కావాల ని పట్టుదలగా ఉంది. 

పాత లోపాలను సరిదిద్దుకుంటూ, వేలంలో వ్యూహాత్మక కొనుగోళ్లు, సమర్థవంతమైన కోచింగ్ స్టాఫ్‌‌తో ఈ సీజన్ లో కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఇండియా టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. ఈ ఐపీఎల్ ద్వారా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఆశిష్ నెహ్రా మార్గదర్శకత్వంలో యంగ్ ప్లేయర్లతో కూడిన ఈ టీమ్ కొత్త వ్యూహాలతో సిద్ధమైంది.

బలాలు
ఈ సారి గుజరాత్ టాపార్డర్ చాలా బలంగా ఉంది. కెప్టెన్ గిల్ నిలకడకు తోడు, జోస్ బట్లర్ పవర్ ప్లేలో మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ మూడో స్థానంలో జట్టుకు గట్టి పునాది వేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తమ రోల్స్ పై స్పష్టత ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఇక బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ లాంటి మిస్టరీ స్పిన్నర్ ఉండటం ప్రత్యర్థులకు సవాల్ విసరనుంది. ఇండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిధ్‌‌ కృష్ణ చేరికతో పేస్ విభాగం కూడా పటిష్టంగా మారింది. ముఖ్యంగా సొంత మైదానం అహ్మదాబాద్‌‌లో ప్రత్యర్థి జట్లను కట్టడి చేయడానికి గుజరాత్‌కు మంచి వనరులు ఉన్నాయి.

బలహీనతలు
మిడిలార్డర్ విషయంలో ఈ జట్టు కొంత ఆందోళన కలిగిస్తోంది. గ్లెన్ ఫిలిప్స్ మినహా మిగిలిన ఆటగాళ్లలో నిలకడ లోపించింది. షారూక్ ఖాన్ అస్థిరమైన ఫామ్, కుమార కుషాగ్రాకు ఐపీఎల్ స్థాయిలో పెద్దగా అనుభవం లేకపోవడం జట్టుకు ఇబ్బందిగా మారవచ్చు. వాషింగ్టన్ సుందర్ ఆల్‌‌రౌండర్‌‌గా ఏమేరకు ప్రభావం చూపుతాడో చూడాలి. ఇక స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ పై జట్టు అతిగా ఆధారపడుతోంది. ఒకవేళ రషీద్ విఫలమైతే అతనికి మద్దతుగా నిలిచే మరో స్టార్ స్పిన్నర్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. కీలక సమయాల్లో మిడిలార్డర్ బ్యాటర్లు తడబడితే భారీ స్కోర్లు సాధించడం గుజరాత్ కు కష్టంగా మారనుంది.

గుజరాత్ టైటాన్స్‌ టీమ్
శుభ్‌‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కుమార్ కుషాగ్రా, అనుజ్ రావత్, జోస్ బట్లర్, నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, షారూక్ ఖాన్, రాహుల్ తెవాటియా, కగిసో రబాడ, మహ్మద్‌ సిరాజ్, ప్రసిధ్‌ కృష్ణ, ఇషాంత్ శర్మ, గుర్నూర్ సింగ్ బ్రార్, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, జేసన్ హోల్డర్, అశోక్ శర్మ, ల్యూక్ వుడ్, పృథ్వీ రాజ్, టామ్ బాంటన్.