మార్పు వచ్చింది.. చదువు మారింది .. పూర్వం బడికి.. ఇప్పుడు స్కూల్స్ కు తేడా ఇదే..

మార్పు వచ్చింది.. చదువు మారింది ..  పూర్వం బడికి.. ఇప్పుడు స్కూల్స్ కు తేడా ఇదే..

రామాపురం అనే గ్రామంలో కిష్టయ్యఆనే రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క కొడుకు కిరణ్. కొడుకును బాగా చదివించాలనుకున్నాడు కిష్టయ్య. కిరణ్ కూడా కొద్దిరోజులు బడికి బాగానే వెళ్లాడు. ఒకరోజు బడి పూర్తవకుండానే ఇంటికి వచ్చేశాడు.‘‘ఎందుకు మధ్యలోనే వచ్చేశావు?’’ అని కిష్టయ్య అడిగితే స్కూల్​కు వెళ్లనంటూ మారాం చేశాడు. ‘‘ఎందుకురా బడికి వెళ్లనంటావు? ఇప్పుడు ఏమైందని?’’ అనడిగాడు తండ్రి కిష్టయ్య.‘‘సమాధానం చెప్పకపోతే టీచర్లు గట్టిగా అరుస్తున్నారు’’ అన్నాడు కిరణ్.

‘‘ఓస్ అంతేనా! మేం చదివేటప్పుడైతే అడిగిన వెంటనే సరైన సమాధానం చెప్పకపోతే చెవులు మెలితిప్పేవాళ్లు. దాంతో మెదడు చురుగ్గా పని చేసి, మర్చిపోయింది కూడా గుర్తుకొచ్చేది’’ అన్నాడు కిష్టయ్య.‘‘తిట్టడమే కాదు కోపంగా చూస్తున్నారు’’ అంటూ ఏడుపు ముఖంతో చెప్పాడు కిరణ్.
‘‘నువ్వే నయం మాకైతే తల పైన మొట్టికాయ వేసేవాళ్లు ఆ దెబ్బతో మొద్దుబారిన మెదడు చురుగ్గా పని చేసేది’’ అన్నాడు కిష్టయ్య. తండ్రి మాటకు క్షణం ఆలోచించి ‘‘అంతేకాదు హోం వర్క్ కొంచెం మిగిలించినా చివాట్లు పెడుతున్నారు’’ అన్నాడు కిరణ్.

‘‘అవునా అంతేనా.. మేం అలా చేస్తే చేయి చాపమని బెత్తంతో వాతలు పడేలా కొట్టేవాళ్లు. ఆ దెబ్బతో మరుసటిరోజు వచ్చీరాగానే హోం వర్క్ చూపించేవాళ్లం’’ అన్నాడు కిష్టయ్య. ‘‘ఒక్కరోజు బడికి వెళ్లకపోతే బయట నిలబెడుతున్నారు’’ అన్నాడు కిరణ్.‘‘అంతేకదా.. మేం ఆ రోజుల్లో బడికి వెళ్లకపోతే తోటి స్టూడెంట్స్ వచ్చి పట్టుకెళ్లేవాళ్లు. వెళ్లనని మొండికేస్తే ఎత్తుకెళ్లేవాళ్లు. గోడ కుర్చీ వేయించేవాళ్లు. ఆ దెబ్బతో రోజూ పాఠశాలకు వెళ్లేవాళ్లం’’ అన్నాడు కిష్టయ్య.

‘‘మార్కులు తక్కువ వస్తే తిడుతున్నారు డాడీ..’’ అన్నాడు కిరణ్.‘‘మా రోజుల్లో పరీక్షలో తప్పులు రాస్తే తిట్లతోపాటు తొడపాశం కూడా పెట్టేవాళ్లు. దీంతో తరువాత పరీక్ష బాగా రాసేవాళ్లం’’ అన్నాడు కిష్టయ్య. ఇలా అప్పట్లో వాళ్ల మాస్టార్లు వేసే శిక్షల గురించి కొడుక్కి చెప్తూ సరదాగా నవ్విస్తూనే, వాళ్లు ఎంత కష్టపడి చదివారో అర్థమయ్యేలా తనదైన శైలిలో వివరించాడు.  

‘‘అమ్మ బాబోయ్! అవునా’’ అంటూ ఆశ్చర్యంగా చూశాడు కిరణ్. ‘‘అప్పట్లో చదువంటే ఆషామాషీ కాదు. మా అబ్బాయి చదవకపోతే బాగా కొట్టమని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు చెప్పేవాళ్లు. మీరు చూడు.. తిట్టినందుకే అంత బాధ పడిపోతారు. మా సారు కొట్టే దెబ్బలకు వారం రోజులైనా వాతలు పోయేవి కాదు. ఇలా ఎన్నో శిక్షలు పడ్డాం. అయినా వేటికీ బెదరకుండా చదువు మీదే దృష్టి పెట్టాం. శ్రద్ధగా చదివి ఈ స్థాయికి వచ్చాం. ఈరోజుకి కూడా నోటి లెక్కలు వేస్తాం. చూడకుండా.. పాఠం అప్పజెప్తాం. అంత కఠినమైన శిక్షణ ఉన్నా కూడా ఏరోజూ మేం స్కూల్​ డుమ్మా కొట్టలేదు. 

పొద్దున లేవగానే త్వరగా రెడీ అయిపోయి, స్కూల్ టైం కంటే ముందే గేటు దగ్గర ఉండేవాళ్లం. ఒకరినొకరు పిలుచుకుని, ఫ్రెండ్స్​ అంతా జాలీగా వెళ్లొచ్చేవాళ్లం’’ అన్నాడు కిష్టయ్య నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ . ‘‘డాడీ చెప్పింది నిజమే. ఆ రోజులతో పోలిస్తే ఈరోజుల్లో చాలానే తేడా ఉంది’’ అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లాడు కిరణ్. మరుసటిరోజు కిష్టయ్య ఆలస్యంగా నిద్ర లేచాడు. అప్పటికే కిరణ్ స్కూల్​కి వెళ్లాడని తెలిసి కొడుకులో మార్పు వచ్చినందుకు కిష్టయ్య చాలా ఆనందించాడు. ఆరోజు నుంచి కిరణ్ కూడా బడి ఎగ్గొట్టకుండా, శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు.     

- నరెద్దుల రాజారెడ్డి -