- కేసీఆర్ మళ్లా రాడు.. ఆయనకు ఏం కాకుండా చూసుకోండ్రి
- మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి, వెలుగు:‘బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేండ్లలో రేషన్‌కార్డులు ఇయ్యలే. ఇండ్లు ఇయ్యలే. మేము అధికారంలోకి వచ్చి రెండేండ్లు కాకముందే.. కొంపలు మునిగినట్లు కావ్.. కావ్’ అని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ లీడర్లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫైర్ అయ్యారు. యాదాద్రి జిల్లా మోటకొండూరులో రూ.10 కోట్లతో నిర్మిస్తున్న ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్‌స్టేషన్ బిల్డింగ్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఫామ్‌హౌస్ కే పరిమితమయ్యారని, కాళేశ్వరం కూలిపోయిందని, రూ.లక్ష కోట్ల అప్పులు చేస్తే మిత్తీలు కడుతున్నామని చెప్పారు. రెండేండ్లు ఆగండి, మళ్లా కేసీఆర్ సీఎం అవుతారంటూ కేటీఆర్ చేస్తున్న కామెంట్లను ఆయన ప్రస్తావించారు. ‘మీ నాయన ఎక్కడి నుంచి వస్తడు. రెండేండ్లాయే.. మీ నాయన అసెంబ్లీకి రాలేదు. సీఎంగా ఉంటేనే వస్తడా? అంటూ నిలదీశారు. అధికారంలో ఉండగా ధరణి, కాళేశ్వరం అని దోచుకున్నారని, ఓడిపోతే ఫామ్‌హౌస్‌లో పడుకుంటున్నాడని విమర్శించారు.
మొన్ననే హరీశ్‌రావు, సంతోష్‌రావు దోచుకున్నారని కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రామన్న జాగ్రత్త కేటీఆర్‌ను హెచ్చరించిందని, మీ సక్కదనానికి కొట్లాటలే సరిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎక్కడికి రాడన్నారు. ‘మీ లొల్లితోటి ఆయనకు ఏమన్న అవుతుందేమో? ఆయనకు ఏం కాకుండా చూసుకోండి’ అని సూచించారు.
ఇరవై ఏండ్లు తామే అధికారంలో ఉంటామని స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కూడా అయిలయ్యనే గెలిపించాలని, మీరు కోరుకున్నట్టుగా మినిస్టర్ అవుతారని తెలిపారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలను ఏ మాత్రం పట్టించుకోకుండా.. నీచ రాజకీయాలు చేస్తూ ఎన్నికల పేరుతో రెండు అచ్చోసిన ఆంబోతులు హైదరాబాద్‌లో తిరుగుతున్నాయని ఫైర్ అయ్యారు. అనంతరం మహిళా సంఘాలకు రూ.36 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాల చెక్కులు అందజేశారు.ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, ఏ భాస్కరరావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, డీఆర్డీవో నాగిరెడ్డి ఉన్నారు.
