- సింగరేణికి పవర్జనరేషన్.. జెన్‌కోకు తాడిచర్ల మైన్
- ఇతర రాష్ట్రాల వారికే ఔట్సోర్సింగ్కొలువులు
- ఉద్యోగాల కోసం స్థానిక యువత నిత్య పోరాటాలు
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌కో పాలిట శాపంగా మారాయి. బొగ్గు తవ్వాల్సిన సింగరేణికి పవర్ జనరేషన్.. పవర్ జనరేట్ చేయాల్సిన జెన్‌కోకు బొగ్గు తవ్వే బాధ్యతలు అప్పగించడంతో ఆయా సంస్థల్లో ఉన్న సాంకేతిక నిపుణులు, సిబ్బందిని వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది.
రెండు సంస్థలు తమకు అనుభవం లేని పనులు చేయలేక ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించి ప్రతినెలా రూ. కోట్లలో చెల్లిస్తున్నాయి. ఆయా ప్రైవేట్ ఏజెన్సీలు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, సాంకేతిక నిపుణులను ఉద్యోగాల్లో నియమించుకోవడంతో స్థానిక నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు గండిపడింది. ఆయా ప్రాజెక్టుల కోసం భూములిచ్చిన నిర్వాసితులకు సైతం ఉద్యోగాలు దొరక్కపోవడంతో తరుచూ ఆందోళనకు దిగుతున్నారు.
సింగరేణి, జెన్‌కోలకు ఉల్టా పనులు
సింగరేణికి బొగ్గు ఉత్పత్తిలో137 ఏండ్ల అనుభవం ఉంది. జెన్‌కోకు పవర్ జనరేషన్‌లో పేరుంది. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం బొగ్గు తవ్వాల్సిన సింగరేణికి పవర్ జెనరేషన్, పవర్ జెనరేట్ చేయాల్సిన జెన్ కోకు బొగ్గు తవ్వకాల బాధ్యతలను అప్పగించింది.
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సింగరేణి 2016లో 1,200 మెగావాట్ల సామర్థ్యంతో రెండు థర్మల్ పవర్ప్లాంట్లను ఏర్పాటుచేసి విద్యుత్ ఉత్పత్తి చేపట్టింది. తాజాగా ఇక్కడ మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. రూ. 18 వేల కోట్లపైగా భారీ పెట్టుబడితో ఏర్పాటు చేసిన జైపూర్ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం స్థానికంగా 300 కుటుంబాల నుంచి 1,058 ఎకరాల భూమి సేకరించింది.
భూసేకరణ సమయంలో స్థానికులకు, ముఖ్యంగా ఆయా కుటుంబాల్లోని నిరుద్యోగులకు పవర్ ప్లాంట్‌లో ఉద్యోగాలిస్తామని అప్పటి ప్రభుత్వం ఆశపెట్టింది. మరోవైపు భూపాలపల్లి జిల్లా తాడిచెర్లలో 47.93 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా బొగ్గు తవ్వకం బాధ్యతలను నాటి ప్రభుత్వం జెన్‌కోకు అప్పగించింది.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా నాటి బీఆర్‌ఎస్ సర్కారు తాడిచర్ల బ్లాక్‌ను జెన్కో పేరిట 2015లో ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించింది. రైతుల నుంచి సేకరించిన 2,300 ఎకరాల భూమిలో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 300కు పైగా భూ నిర్వాసిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
తాడిచెర్లలో ఉపాధికి దూరమైన స్థానికులు
తాడిచెర్ల ఓసీపీని దక్కించుకున్న జెన్‌కోకు కోల్ మైనింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. అందువల్ల బొగ్గు తవ్వకాల కోసం కొత్తగా సాంకేతిక నిపుణులు, కార్మికులు, సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడంతో పాటు యంత్ర సామగ్రిని సమకూర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
అలాగే ఓపెన్ కాస్ట్ నుంచి కన్వేయర్ బెల్ట్‌ద్వారా 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న కేటీపీపీకి ఏడాదికి 25 లక్షల టన్నుల బొగ్గును తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా తమ వల్ల కాదని జెన్‌కో చేతులెత్తేయడంతో మైనింగ్‌ను సింగరేణికి కాకుండా ఏఎంఆర్ అనే ప్రైవేట్ కంపెనీకి 25 ఏళ్ల పాటు లీజుకిచ్చారు. ఇదంతా అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఒక పథకం ప్రకారం జరిగిందనే ఆరోపణలున్నాయి.
ఈ క్రమంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా కోసం జెన్‌కో యేటా రూ.700 కోట్లు ఏఎంఆర్ సంస్థకు చెల్లిస్తోంది. ఈ ఓసీలో సుమారు వెయ్యి నుంచి 1,400 మంది ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో భూనిర్వాసిత కుటుంబాలకు చెందిన వారు కేవలం 10 శాతం వరకు ఉండగా మిగిలిన వారంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. ఓసీని సింగరేణికి ఇస్తే ఉద్యోగాలన్నీ
స్థానికులకే లభించేవి.
జైపూర్‌లోనూ సేమ్ సీన్
సింగరేణికి పవర్ జనరేషన్‌లో అనుభవం లేకపోవడంతో జైపూర్‌లోని థర్మల్ పవర్ ప్లాంట్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యతలను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించారు. ఇందుకు ఏటా రూ.300 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ప్లాంట్‌లో పని చేస్తున్న వందకు పైగా సింగరేణి రెగ్యులర్ సిబ్బందికి, 2,700 మందికి పైగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు ఇందులోంచే వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ చత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకున్నది. భూ నిర్వాసితులకు పెద్దగా ఉద్యోగాలు ఇవ్వలేదు.
పవర్ జనరేషన్ బాధ్యతలను జెన్‌కోకు అప్పగిస్తే లోకల్ వాళ్లకు ఉద్యోగాలు దక్కేవి. పర్మినెంట్ స్టాఫ్ కూడా పెరిగేవాళ్లు. ఇప్పుడు ఇక్కడ మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుచేయబోతున్నారు. దీంతో మరో 2 వేలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.
ఇవి కూడా పొరుగు రాష్ట్రాల వాళ్లకే దక్కే అవకాశాలున్నాయి. బొగ్గు తవ్వకాలు సింగరేణికి, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ల బాధ్యతలు జెన్‌కోకు దక్కితే రాష్ట్రంలో సుమారు 6 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కేవని పలువురు చెబుతున్నారు.
భూములిచ్చిన 50 శాతానికి పైగా కుటుంబాలకు ఉద్యోగాలు దొరికేవని, ప్రతీ యేటా జీతాల రూపేణా రూ.వందల కోట్లు ఇలా పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితి ఉండేదికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
