ఇండియాలో మందుల ధరలు కంట్రోల్ చేయాలె

ఇండియాలో మందుల ధరలు కంట్రోల్ చేయాలె
  • ఇండియాలో కామన్ రోగాల ట్రీట్​మెంట్​కు ఇదే కీలకం
  • ధరల కంట్రోలింగ్ రెండువైపులా పదునైన కత్తిలాంటిది
  • ‘బ్రూకింగ్స్ ఇండియా’ రిపోర్ట్​

మన దేశంల దాదాపుగా 3 శాతం నుంచి 4 శాతం వరకూ నకిలీ, నాణ్యత లేని మందులే సరఫరా అవుతున్నాయట. గత రెండు దశాబ్దాల్లో గుండెజబ్బులు, శ్వాస సంబంధమైన సమస్యలు పెరిగాయట. డయాబెటిస్ లాంటి లైఫ్​స్టైల్ వ్యాధులూ ఎక్కువైనాయట. మొత్తంగా మనదేశంల అంటురోగాలు కాని.. రోగాల ముప్పే బాగా పెరిగిందట. అయితే, ఈ రోగాలకు మంచి ట్రీట్ మెంట్ అందాలంటే.. ముందుగా వీటి మందులపై ధరల కంట్రోలింగ్ మంచిగ ఉండాలట. మందుల ధరలను కంట్రోల్ చేయడమనేది రెండంచులా పదును ఉన్న కత్తిలాంటిదని, ఈ కంట్రోలింగ్ సరిగ్గా లేకుంటే.. అటు ఇండస్ట్రీ, పెట్టుబడిదారులకు, ఇటు వినియోగదారులకూ నష్టం కలుగుతుందట. ఈ విషయాలను వాషింగ్టన్​కు చెందిన నాన్ ప్రాఫిట్ పాలసీ రీసెర్చ్ సంస్థ బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్​కు అనుబంధంగా ఉన్న బ్రూకింగ్ ఇండియా ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది. దేశంలో గత రెండు దశాబ్దాల్లో మందుల ధరల నియంత్రణ ఎలా మారుతూ వచ్చిందన్న అంశంపై ఫోకస్ చేస్తూ.. ‘ఇండియాలో మందులు: అందుబాటు, సరైన ధర, నాణ్యత’ పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు.  బ్రూకింగ్స్ ఇండియా రీసెర్చర్లు ప్రాచీ సింగ్, షమికా రవి, డేవిడ్ దామ్ ఈ రిపోర్ట్​ను తయారు చేశారు. మందుల ధరలను చాలా జాగ్రత్తగా కంట్రోల్​ చేయాలన్నారు.

నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే..?

1995 నుంచి 2012 మధ్యకాలంలో ‘జాతీయ అత్యవసర మందుల జాబితా’లో 74 మందులు మాత్రమే ఉండేవి. 2013 తర్వాత వీటి సంఖ్య భారీగా పెరిగింది.

  • ప్రస్తుతం ఈ జాబితాలో 800 ఫార్ములేషన్లతో కూడిన 347 మందులు ఉన్నాయి.
  • ఈ లిస్టులోని మందులను నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకు తయారీదారులు అమ్మరాదు.
  • ధరల కంట్రోలింగ్ తరచూ కొత్త మందుల తయారీకి అడ్డంకిగా మారుతోంది. దీనివల్ల ఇన్నోవేషన్స్ మరుగునపడుతున్నాయి.
  • మిగతా అన్ని మందుల కంటే అత్యవసర మందులకు ధరల నియంత్రణే చాలా కీలకమైనది.
  • నోటి నుంచి మొదలుకొని మొత్తం జీర్ణవ్యవస్థ, పెద్ద పేగు వరకూ, గుండె, ఊపిరితిత్తుల సంబంధమైన మూడు రకాల రోగాలకు వాడే మందులు అత్యవసర మందుల లిస్టులో ఉన్నాయి.
  • భవిష్యత్తులో మందుల ధరల నియంత్రణ ఎలా ఉండాలన్నదానిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ మందుల ధరలను కంట్రోల్ చేయాలి? వేటిని కంట్రోల్ చేయరాదన్న దానిపై ప్రభుత్వం ప్రయారిటీలను నిర్ణయించుకోవాలి.
  • దేశంలో ఫేక్, నాణ్యత లేని మందులు 3 నుంచి 4 శాతం వరకూ ఉన్నాయి.
  • రాష్ట్ర స్థాయిలో తనిఖీలు, లైసెన్సుల జారీలో అవకతవకలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.