మొన్నామధ్య గుజరాత్‌లో మస్తు వరదలొచ్చినపుడు వడోదర వీధుల్లోకి మొసళ్లు వచ్చాయి కదా. ఈసారి కాస్త చేంజ్. మొసళ్లకు బదులు సింహాలు రోడ్లపైకి వచ్చాయి. ఏకంగా ఏడు సింహాలు రోడ్లపై తిరుగుతూ హల్‌చల్ చేశాయి. గిర్నార్ ఫారెస్టుకు దగ్గర్లోని జునాగఢ్ నగరం బాల్‌నాగ్ ప్రాంతంలో రాత్రిపూట జనావాసాల్లోకి వచ్చాయి. భారతీ ఆశ్రమంలోని రోడ్డుపై నడుస్తూ భయపెట్టేశాయి. సింహాల గుంపు రోడ్డుపై నడుచుకంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. క్షణాల్లోనే ఆ వీడియో వైరలైంది. కాసేపు అక్కడే తిరిగిన సింహాలు తిరిగి వెనక్కి వెళ్లినట్లు వీడియోలో ఉంది. గిర్నార్ అడవి జునాగఢ్‌కు దగ్గర్లోనే ఉండటంతో సింహాలు తరచూ బయటకు వస్తుంటాయని, రాత్రి వేళలో రోడ్ల మీద తిరిగి అడవికి వెళ్లిపోతాయని, ఇక్కడ ఇది సాధారణ విషయమని డిప్యూటీ ఫారెస్ట్ కన్జర్వేటివ్ అధికారి సునిల్ కుమార్ బెర్వాల్ చెప్పారు. జునాగఢ్‌కు దగ్గర్లోని గిర్నార్ అడవిలో 40కి పైగా ఏసియాటిక్ లయన్స్ ఉన్నాయి.
