
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ ను రాజకీయంగా బొంద పెడామని అన్నారు. కిరాయి ఇంట్లో ఉన్న జగదీష్ రెడ్డి నాగారంలో పెద్డ కోట కట్టిండని శంషాబాద్ లో 100 ఎకరాలతో ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపించారు. సూర్యపేటలో జగదీష్ రెడ్డి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారని విమర్శించారు. దామొదర్ రెడ్డికి ఎదురు నిలిచే ధైర్యం జగదీష్ రెడ్డికి లేదని అన్నారు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు తథ్యమని అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఊరికే టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ వచ్చినా చామల గెలుపును ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని అన్నారు. కవిత తీహార్ జైల్లో బతుకమ్మ ఆడుతుందని తాను ఎప్పుడో చెప్పానని తాము తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని తెలిపారు. మరో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తమకు పోటీ నల్లగొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థితోనే అని రాజగోపాల్ రెడ్డి అన్నారు.