
ప్రధాని మోడీ ఈ నెల 8న త్రిపురలో పర్యటించబోతున్నారు. త్రిపురలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు త్రిపుర సీనియర్ అధికారి తెలిపారు. త్రిపురలో ప్రధాని పర్యటనకు సంబంధించి ముఖ్య కార్యదర్శి ఎస్‌కే సిన్హా సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శనివారం ఎస్పీజీ బృందం కూడా త్రిపురకు చేరుకోనుంది.
మాణిక్ సాహా రాజీనామా
త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శుక్రవారం గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. త్రిపురలో మార్చి 8న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని..ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారని వెల్లడించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవం వివేకానంద మైదానంలో జరగనుంది. త్రిపురలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారం చేపట్టనున్న నేపథ్యంలో NDA చైర్మన్గా ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ త్రిపురకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేపీ విజయం..
త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో గత నెల ఎన్నికలు జరిగాయి. మార్చి 2న ఫలితాలు వెలవడ్డాయి. అయితే త్రిపురలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగానూ... బీజేపీకి 32 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ ఓ స్థానం దక్కించుకుంది.