శక్తిమంతమైన ఇండియాకు.. బలమైన పునాది వేశాం: మోదీ

శక్తిమంతమైన ఇండియాకు.. బలమైన పునాది వేశాం: మోదీ
  •     ఆర్టికల్ 37‌‌0, ట్రిపుల్ తలాక్ రద్దు చరిత్రాత్మక నిర్ణయాలు
  •     17వ లోక్​సభ చివరి రోజు సెషన్​లో ప్రధాని

న్యూఢిల్లీ: ఐదేండ్ల ఎన్డీఏ పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అద్భుతమైన ఆవిష్కరణలు చేశామని తెలిపారు. శక్తిమంతమైన ఇండియాకు బలమైన పునాది వేశామన్నారు. తమ పాలనలో దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని తెలిపారు. రిఫామ్‌, పెర్ఫామ్‌, ట్రాన్స్‌ఫామ్‌లపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు.

కొన్ని దశాబ్దాల పాటు దేశం ఎదుర్కొన్న ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ వంటి ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ముందు 17వ లోక్‌సభ చివరిరోజు సమావేశాల్లో ప్రధాని మోదీ మాట్లాడారు “మా ఐదేండ్ల పాలనలో ఎన్నో చాలెంజ్​లను ఎదుర్కొన్నాం. భయపడి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎన్నో తరాలు.. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయాలను ప్రస్తుత 17వ లోక్‌సభ కాలంలో తీసుకున్నాం.

జీ20 సమ్మిట్ నిర్వహించడంతో ఇండియా ప్రతిష్ట ప్రపంచ స్థాయికి ఎదిగింది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన ఇండియాను ఉంచాం. డేటా ప్రొటెక్షన్ బిల్లు, టెర్రరిజంపై పోరాడేందుకు కఠినమైన చట్టాలు తీసుకొచ్చాం. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తొలగించాం. మహిళా రిజర్వేషన్ బిల్లు మా పాలనకు నిదర్శనం. కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ను కట్టుకున్నాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించి దేశ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాం’’ అని మోదీ అన్నారు.

కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం

పార్లమెంట్​లో సెంగోల్‌ను స్థాపించామని ప్రధాని మోదీ అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. ఫ్రీగా వ్యాక్సిన్లు ఇచ్చామన్నారు. కరోనా టైమ్ నుంచి ఫ్రీ రేషన్ అందజేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. ‘ట్రాన్స్​జెండర్లతో పాటు అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరికి గుర్తింపు ఇచ్చాం.

ట్రాన్స్​జెండర్లకు గుర్తింపు కార్డులు అందజేశాం. ఒకప్పుడు సమాజంలో వారిని ఎవరూ గౌరవించేవాళ్లు కాదు. కానీ.. ఇప్పుడు అన్ని రంగాల్లో వాళ్ల సేవలను ఉపయోగించుకుంటున్నాం. ముద్రా స్కీమ్ కింద లోన్లు కూడా ఇస్తున్నాం. ఇప్పుడు వారంతా గౌరవంగా బతుకుతున్నారు’’అని మోదీ తెలిపారు. కాగా, స్వాతంత్ర్య సాధన లక్ష్యాలను ప్రతి రోజూ స్మరించుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు. వాటి దిశగా తమ పాలన కొనసాగుతున్నదన్నారు.రాబోయే పాతికేండ్లు ఎంతో కీలకమని తెలిపారు.