రాజ్యాంగమే మన బలం..ఇండియా కోసం సమష్టిగా కష్టపడదాం

రాజ్యాంగమే మన బలం..ఇండియా కోసం సమష్టిగా కష్టపడదాం

న్యూఢిల్లీ: ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘వ్యక్తులు గానీ, సంస్థలు గానీ.. మన ప్రాథమిక విధులే మనకు ఫస్ట్ ప్రయారిటీ. ప్రతి ఒక్కరూ తమ విధులను సమర్థంగా నిర్వహించడం ద్వారా దేశాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలోని సుప్రీంకోర్టు వద్ద నిర్వహించిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. మన రాజ్యాంగమే మనకు అతిపెద్ద బలమన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులు అనేవి పౌరులు అత్యంత అంకితభావంతో నిర్వర్తించాల్సిన బాధ్యతలు అని మహాత్మా గాంధీ అన్న మాటలను మోడీ గుర్తు చేశారు. ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు వచ్చే 25 ఏండ్లు అమృత కాలమని, దీనిని ‘కర్తవ్య కాలం’గా భావిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ విధులను బాగా నిర్వర్తించాలని కోరారు. మన రాజ్యాంగ పీఠికలోని మొదటి మూడు పదాలు.. ‘వియ్ ద పీపుల్ (మేం, ప్రజలం)’ అనేవి కేవలం పదాలు కావని, అవి ఒక పిలుపు, సత్యం, ప్రతిజ్ఞ అని మోడీ అన్నారు.   

 రాజ్యాంగ రచనలో మహిళలూ కృషి చేసిన్రు 

కాన్​స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 15 మంది మహిళా సభ్యులు ఉన్నా.. వారికి తగినంత గుర్తింపు దక్కలేదని ప్రధాని మోడీ అన్నారు. దాక్షాయణి వేలాయుధన్, దుర్గాబాయి దేశ్ ముఖ్, హన్సా మెహతా, రాజ్ కుమారి అమృత్ కౌర్, ఇతర మహిళా సభ్యులు గణనీయ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఏజీ ఆర్. వెంకటరమణి, ఎస్జీ తుషార్ మెహతా, తదితరులు పాల్గొన్నారు.  

డిజిటల్ కోర్ట్ 

కోర్టుల్లో పేపర్ల వాడకాన్ని తగ్గించి, డిజిటలైజ్ చేయడం కోసం రికార్డులను డిజిటల్ ఫామ్​లోకి మార్చి, జడ్జిలకు అందుబాటులోకి తెస్తారు. దశలవారీగా అన్ని కోర్టులను పేపర్ లెస్ కోర్టులుగా మారుస్తారు. కాగా, ఎస్3డబ్ల్యూఏఏఎస్(సెక్యూర్, స్కేలేబుల్ అండ్ సుగమ్య వెబ్ సైట్ యాజ్ ఏ సర్వీస్) వెబ్ సైట్​ను జిల్లా స్థాయిలో న్యాయ వ్యవస్థ సేవల వివరాలను ఉంచే వెబ్ సైట్​ల నిర్వహణను సులభతరం చేసేందుకు ఏర్పాటు చేశారు.

కోర్టులు జనానికి దగ్గరవ్వాలె: సీజేఐ 

టెక్నాలజీని వినియోగించుకుని కోర్టులను రీమోడల్ చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. కోర్టుల్లో లిటిగేషన్ (వ్యాజ్యం) ప్రక్రియను మరింత సులభతరం చేసి, న్యాయవ్యవస్థను సిటిజన్ సెంట్రిక్ గా మార్చాలన్నారు. సుప్రీంకోర్టు ఆవరణలో శనివారం రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడారు. ‘‘పౌరులు న్యాయం కోసం తపిస్తూ కోర్టులకు చేరుకోవడం కాదు.. కోర్టులే పౌరులకు చేరువ అయ్యేలా టెక్నాలజీతో రీమోడల్ చెయ్యాల్సిన అవసరం ఉంది” అని సీజేఐ చెప్పారు.


‘ఈ-కోర్ట్’ ప్రాజెక్టు ప్రారంభం  

రాజ్యాంగ దినోత్సవ వేడుకల సందర్భంగా ‘ఈ–కోర్ట్’ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ద్వారా లిటిగెంట్లు, లాయర్లు, న్యాయ వ్యవస్థకు డిజిటల్ సేవలను అందిం చేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టింది.

వర్చువల్ జస్టిస్ క్లాక్

కోర్టుల్లో రోజు, వారం, నెల వారీగా విచారించిన, పరిష్కరించిన, పెండింగ్ కేసుల సంఖ్యను తెలియజేసేందుకు వర్చువల్ జస్టిస్ క్లాక్ ను ప్రవేశపెట్టారు. కోర్టుల్లో జవాబుదారీతనం, పారదర్శకతను పెంచేందుకు గాను దేశంలోని అన్ని కోర్టులకు సంబంధించిన వర్చువల్ జస్టిస్ క్లాక్ లను సంబంధిత జిల్లా కోర్టుల వెబ్ సైట్ లలో ప్రదర్శించనున్నారు. దీనితో ఆయా కోర్టుల పరిధిలో కేసుల స్థితిపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం తెలియనుంది. 

జస్టిస్ మొబైల్ యాప్ 2.0 

జ్యుడీషియల్ ఆఫీసర్లు కోర్టుల నిర్వహణను సమర్థంగా చేపట్టేందుకు సహాయం కోసం జస్టిస్ మొబైల్ యాప్ 2.0ను తీసుకొచ్చారు. ప్రధానంగా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఈ యాప్ ను అందుబాటులోకి తెచ్చారు. కోర్టుల్లోని పెండింగ్ కేసులు, పరిష్కారమైన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు ఈ యాప్ తో పర్యవేక్షించవచ్చు.