మహిళా శక్తితో.. అసాధ్యం సుసాధ్యమైతది: ప్రధాని మోదీ

మహిళా శక్తితో.. అసాధ్యం సుసాధ్యమైతది:  ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ఏ పనిలో అయినా మహిళా శక్తి తోడైతే అసాధ్యం సుసాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చంద్రయాన్ మిషన్ విజయవంతం కావడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. ఆదివారం ఉదయం మన్ కీ బాత్ రేడియో ప్రోగ్రాం104వ ఎపిసోడ్​లో ప్రధాని మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా గెలవాలనేది ఇప్పుడు ఇండియాకు తెలుసన్నారు. మిషన్ చంద్రయాన్ ఇప్పుడు న్యూ ఇండియా స్ఫూర్తికి సంకేతంగా నిలిచిందన్నారు. చంద్రయాన్–3 విజయంలో మహిళా సైంటిస్టుల పాత్రను ఆయన మరోసారి ప్రశంసించారు. 

‘‘ఎప్పుడైతే ఒక దేశం ఆడబిడ్డలు గొప్ప ఆశయాలతో ముందుకు వస్తారో.. అప్పుడు ఆ దేశ అభివృద్ధిని ఏదీ అడ్డుకోలేదు” అని అన్నారు. మహిళల నాయకత్వంలో అభివృద్ధి అనేది దేశానికి ప్రధాన లక్షణం కావాలని ఎర్రకోటపై ప్రసంగం సందర్భంగా కూడా చెప్పానని గుర్తు చేశారు. చంద్రయాన్ జాబిల్లిపైకి చేరి 3 రోజులు దాటుతోందని, ఆ మిషన్ గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు. తాను రాసిన ఓ కవితలోని కొన్ని వాక్యాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. ‘సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు. చంద్రయాన్–3తో చంద్రుడిపై కూడా సూర్యోదయాలు మొదలయ్యాయి’ అని మోదీ అభివర్ణించారు.   

తెలుగు భాషలో వెలకట్టలేని రత్నాలున్నయ్

ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’104 ఎపిసోడ్‌లో భాగంగా దేశ ప్రజలతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పదనం, ఈ ప్రాంతాలకు చెందిన మహనీయులను గుర్తు చేసుకున్నారు. ‘‘మూలాలతో, సంస్కృతితో, సంప్రదాయాలతో అనుసంధానమయ్యేందుకు మాతృ భాష శక్తివంతమైన మాధ్యమం. 

భారతీయ ప్రాచీన భాషల్లో తెలుగు భాష ఒకటి. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. తెలుగు భాష సాహిత్యం, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగున్నాయని కొనియాడారు. తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు.