థర్డ్ ఫేజ్ పోలింగ్..ఓటేసిన ప్రధాని మోదీ

థర్డ్ ఫేజ్ పోలింగ్..ఓటేసిన ప్రధాని మోదీ

లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  కొనసాగుతోంది.ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు క్యూ కట్టారు. ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో  ప్రధాని నరేంద్ర మోదీ ఓటు వేశారు. 

అంతకుముందు మాట్లాడిన మోదీ.. దేశంలో ప్రజాస్వామ్య పండగ జరుగుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎన్నికల కమిషన్ కృషికి అభినందనలు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం మామూలు విషయం కాదన్నారు. ఎండలలో జాత్రత్తగా ఉండండి, మంచినీళ్లు బాగా తాగాలని కోరారు. ఈ ఏడాది 64 దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. మోదీని చూసేందుకు చాలా మంది అభిమానులు క్యూ కట్టారు. పోలింగ్ కేంద్రం దగ్గర కొందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చారు మోదీ. 

మోదీతో పాటు పోలింగ్ కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చారు. అంతకముందు ఎలక్షన్ సందర్భంగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. ఎక్కువ సంఖ్యలో ఓటింగ్‎లోపాల్గొనాలని పిలుపునిచ్చారు. అధిక ఓటింగ్ తో రికార్డు సృష్టించాలన్నారు. మీ భాగస్వామ్యం ప్రజాస్వామ్యానికి మరింత వన్నె తెస్తుందంటూ ట్వీట్ చేశారు. 

 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించు కుంటున్నారు. గుజరాత్, గోవా, కేంద పాలిత ప్రాంతాలు దాద్రానగర్  హవేలి, డామన్  డయ్యూకు మూడో దశలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అస్సాంలో 4, బీహార్ లో 5, చత్తీస్ గఢ్ లో 7, మధ్యప్రదేశ్ లో 8, మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ లో 10, పశ్చిమ బెంగాల్ లో 4 స్థానాలకు కూడా మూడో దశలో పోలింగ్  జరుగుతోంది.

కీలక స్థానాలివే..

గుజరాత్ లోని గాంధీనగర్, మహారాష్ట్రలోని బారామతి, మధ్యప్రదేశ్ లోని విదిశ, గుణ, కర్నాటకలోని ధార్వాడ్, హవేరి, అస్సాంలోని ధుబ్రి వంటి కీలక నియోజకవర్గాలకు మూడో దశలోనే ఎన్నికలు జరగనున్నాయి. గాంధీ నగర్ లో బీజేపీ తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాంగ్రెస్  అభ్యర్థి సోనాల్  రమణ్ భాయ్  పటేల్ పై పోటీచేస్తున్నారు. అలాగే బారామతిలో ఎన్సీపీ చీఫ్​ శరద్  పవార్  కూతురు సుప్రియా సూలే.. అజిత్  పవార్  (శరద్  పవార్  తమ్ముని కొడుకు) భార్య సునేత్రా పవార్ పై బరిలో నిలిచారు.