విద్యార్థులతో ప్రధాని రక్షా బంధన్ వేడుకలు

విద్యార్థులతో ప్రధాని రక్షా బంధన్ వేడుకలు
  •     మోదీకి రాఖీలు కట్టిన చిన్నారులు, బ్రహ్మ కుమారీలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తన అధికారిక నివాసంలో రక్షా బంధన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలువురు పాఠశాల విద్యార్థులు, బ్రహ్మ కుమారీ ఆధ్యాత్మిక సంస్థ సభ్యులు ప్రధానికి రాఖీలు కట్టారు. అనంతరం మోదీ చిన్నారులతో కొద్దిసేపు ముచ్చటించారు. రాఖీ వేడుకలతో పాటు విద్యార్థుల ఆనందాన్ని, వారు పంచుకున్న భావాలకు సంబంధించిన వీడియో క్లిప్​ను ప్రధాని మోదీ తన ఎక్స్​ఖాతాలో పోస్ట్​చేశారు. ఓ విద్యార్థి ప్రధానిని "యోధుడు, రక్షకుడు" అనిగా పొగడగా, మరికొందరు ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించారు.

ఒక చిన్నారి "మోదీ అంకుల్" కోసం నెమలి రాఖీ తెచ్చినట్లు చెప్పగా, మరొకరు తాను కూడా ఆయనలాగే ప్రధానమంత్రి కావాలని ఉందని తన కోరికను వ్యక్తం చేశారు. మరో విద్యార్థిని  ప్రభుత్వ పథకాలను గుర్తుంచుకొని, వాటిని కవిత రూపంలో చెప్పడంతో ఆమెను ప్రశంసించారు. వేడుకల్లో ప్రధానమంత్రి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని రక్షా బంధన్​శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, "ఈ రోజు జరిగిన అత్యంత ప్రత్యేకమైన రక్షా బంధన్ వేడుకల హైలైట్స్ ఇక్కడ ఉన్నాయి. మా నారీ శక్తి నిరంతర విశ్వాసం, ప్రేమకు కృతజ్ఞతలు" అంటూ వీడియో క్లిప్‌ కు జతచేశారు.