ఏడవద్దు.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది

ఏడవద్దు.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది
  • విమెన్స్‌‌ టీమ్‌‌ను ఓదార్చిన ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ:  బ్రాంజ్‌‌ మెడల్‌‌ మ్యాచ్‌‌లో ఓడి బాధలో ఉన్న ఇండియా విమెన్స్‌‌ హాకీ ప్లేయర్లతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. కన్నీటి పర్యంతమైన వారిని స్ఫూర్తిదాయకమైన మాటలతో ఓదార్చారు. ‘మీరు అద్భుతంగా ఆడారు. గత ఐదేళ్లుగా ఎన్నో త్యాగాలు చేశారు. ఆట కోసం చెమట చిందించారు. మీ హార్డ్‌‌వర్క్‌‌, పోరాటం మెడల్‌‌ను తెచ్చి ఉండకపోవచ్చు. కానీ దేశంలో ఉన్న ఎంతో మంది బాలికలకు స్ఫూర్తిగా నిలిచారు. మీకు మీ కోచ్‌‌గా అభినందనలు’ అని పీఎం వ్యాఖ్యానించారు. ఫోన్‌‌లో మోడీ మాటలు వింటున్న క్రమంలో ప్లేయర్లు ఏడుపు ఆపుకోలేకపోయారు. అందరూ గంభీరంగా మారిపోవడంతో మళ్లీ కలుగజేసుకున్న మోడీ.. వందన కటారియా, సలీమా టెట్‌‌ పెర్ఫామెన్స్‌‌ను  ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ‘మీలాంటి ప్లేయర్లు ఏడవద్దు. దేశం మొత్తం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఇండియాకు గుర్తింపు అయిన హాకీకి మీరు ప్రాణం పోస్తున్నారు. మీ ఎఫర్ట్‌‌ వల్లే ఇదంతా సాధ్యమైంది’ అని ప్రధాని పేర్కొన్నారు. మ్యాచ్‌‌లో గాయపడి, ముఖానికి కుట్లు వేయించుకున్న నవ్‌‌నీత్‌‌ కౌర్‌‌ గురించి మోడీ ఆరా తీశారు. కోచ్‌‌ మారిన్‌‌ ఎఫర్ట్‌‌ను కూడా ప్రధాని కొనియాడారు.