కేబుల్ బ్రిడ్జి బాధితులకు అండగా ఉంటాం : మోడీ

కేబుల్ బ్రిడ్జి బాధితులకు అండగా ఉంటాం : మోడీ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ
ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ప్రధాని
ప్రమాదంపై సుప్రీంలో పిల్.. ఈ నెల14న విచారణ 

మోర్బీ : గుజరాత్ లోని మోర్బీ టౌన్ లో కూలిపోయిన కేబుల్ బ్రిడ్జి ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం పరిశీలించారు. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ పై రివ్యూ చేశారు. మోర్బీ టౌన్ వద్ద మచ్చూ నదిపై ఉన్న 140 ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జి ఆదివారం కుప్పకూలగా, ఇప్పటివరకు 141 మంది మృతదేహాలను వెలికితీశారు. బ్రిడ్జికి ఓ వైపున దర్బార్ గఢ్ ప్యాలెస్, మరోవైపున స్వామినారాయణ్ టెంపుల్ ఉన్నాయి. హెలికాప్టర్ లో బ్రిడ్జి ప్రాంతానికి చేరుకున్న ప్రధాని ముందుగా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం దర్బార్ గఢ్ వైపున కిందకు దిగిన ప్రధాని.. బ్రిడ్జి కూలిన చోటును పరిశీలించి, అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆ తర్వాత  మోర్బీ సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న వారిని సీఎం భూపేంద్ర పటేల్ తో కలిసి పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులను కూడా మోడీ పరామర్శించారు. బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసులు 304, 308 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బ్రిడ్జికి రిపేర్లు చేసి, రీఓపెన్ చేసిన ఒరెవా కంపెనీకి చెందిన ఇద్దరు మేనేజర్లను, ఇద్దరు టికెట్ బుకింగ్ క్లర్క్‌‌‌‌లను, ఇద్దరు కాంట్రాక్టర్లను, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని అరెస్టు చేశారు. మచ్చూ నదిలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. సోమవారం సాయంత్రం రెస్క్యూ ఆపరేషన్​ ఆపేసిన సిబ్బంది మంగళవారం ఉదయం మళ్లీ సెర్చింగ్ ప్రారంభించారు.    

పీఎం ఫొటోషూట్ కోసం ఆస్పత్రికి రిపేర్లా? : ప్రతిపక్షాల విమర్శలు
మోర్బీ సివిల్ హాస్పిటల్ కు ప్రధాని మోడీ వస్తున్నారని.. సోమవారం రాత్రికి రాత్రే ఆస్పత్రికి పెయింట్ వేయడం, వార్డుల్లో రిపేర్లు చేపట్టడం పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్, ఆప్ తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. ‘‘కొన్నేండ్లుగా పెచ్చులూడిన పాత గోడలతో ఉన్న ఆస్పత్రిని రాత్రికిరాత్రే రిపేర్ చేశారు. వార్డులను క్లీన్ చేశారు. పేషెంట్లకు కొత్త బెడ్ షీట్లు ఇచ్చారు. తాగునీళ్ల కోసం వాటర్ కూలర్లనూ ఏర్పాటు చేశారు. కానీ బెడ్ షీట్లపై జామ్ నగర్ ఆస్పత్రి పేరు ఉండటం, వాటర్ కూలర్లలో అసలు నీళ్లే లేకపోవడం చూస్తే.. ఇదంతా కేవలం ప్రధాని మోడీ ఫొటోషూట్ కోసం ఏర్పాటు చేసిన షో పుటప్ గానే కన్పిస్తోంది” అని ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు. భారీ అవినీతి కారణంగానే బ్రిడ్జి కూలిందని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ రాజీనామా చేయాలని, రాష్ట్రంలో వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.   

బైడెన్‌‌, జిన్ పింగ్ సంతాపం   
మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఇండియన్లకు అండగా నిలుస్తామని ఆయన తెలిపారు. చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ కూడా మృతులకు సంతాపం ప్రకటించారు. మోర్బీ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్, టిబెట్ ఆధ్యాత్మిక నేత దైలైలామా, పలు దేశాల ప్రముఖులు కూడా ఇదివరకే స్పందించారు.

ఈ నెల 14న సుప్రీంకోర్టులో విచారణ
మోర్బీలో బ్రిడ్జి కూలిన ఘటనపై జ్యుడీషియల్ కమిషన్ తో విచారణ చేయించాలంటూ దాఖలైన పిల్ ను ఈ నెల 14న విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలోని కమిషన్ ద్వారా విచారణ జరగాలంటూ అడ్వకేట్ విశాల్ తివారీ వేసిన పిల్ ను సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన బెంచ్ మంగళవారం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్లే బ్రిడ్జి కూలిందని పిటిషనర్ పేర్కొన్నారు. సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల గత దశాబ్దకాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి అనేక ప్రమాదాలు జరిగాయన్నారు.