ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనం.. 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనం.. 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల మార్కెట్ను (డైమండ్ బోర్స్) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (డిసెంబర్ 17న) ప్రారంభించనున్నారు. ఇందుకోసం గుజరాత్ లోని సూరత్‌కు వెళ్లనున్నారు ప్రధాని. ఈ నేపథ్యంలో ప్రధాని రాక సందర్భంగా భద్రతా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 

ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ ‘సూరత్ డైమండ్ బోర్స్’ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా హాజరుకానున్నారు.

రూ.34 వేల కోట్ల ఖర్చుతో 35.54 ఎకరాల స్థలంలో సూరత్ డైమండ్ బర్స్ కాంప్లెక్స్ను నిర్మించారు. ఇదే ఇప్పుడు వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్‌ కనెక్టడ్ భవనం. ఈ బిల్డింగ్ లో 4 వేల 500 ఇంటర్‌ కనెక్టడ్ కార్యాలయాలు ఉన్నాయి. కార్యాలయ భవనం పెంటగాన్ కంటే పెద్దదని చెబుతున్నారు. 

సూరత్ భవనం దేశంలోనే అతిపెద్ద కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్. ఈ భవనంలో 175 దేశాల నుంచి 4 వేల 200 మంది వ్యాపారులు ఉండే సామర్థ్యం ఉంది. విదేశీ వ్యాపారులు పాలిష్ చేసిన వజ్రాలను కొనుగోలు చేయడానికి సూరత్‌కు రానున్నారు. 1.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. గత 80 ఏళ్లుగా ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం ఉన్న పెంటగాన్‌ను ఇప్పుడు సూరత్ డైమండ్ బర్స్ అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

2023, ఆగస్టులో డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో భాగమైన ఈ భవనం ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా గుర్తింపు పొందింది. 35.54 ఎకరాల ప్లాట్‌లో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్‌లో 9 గ్రౌండ్ టవర్లు, 15 అంతస్తులు ఉన్నాయి, 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుంచి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది.

సూరత్ డైమండ్ బోర్స్ లో 45 అంతస్తులు ఉంది. ఇందులో 4 వేల 500 కార్యాలయాలు ఉన్నాయి. 131 హై-స్పీడ్ లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. బోర్స్ కాంప్లెక్స్ మొత్తం వాస్తు సూత్రాల ప్రకారం నిర్మించారు. అంతేకాదు.. బిల్డింగ్ పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాదాపు 15 ఎకరాల్లో గ్రీనరీ ఏర్పాటు చేశారు. 

ప్రతి ఏటా ప్రస్తుతం రూ. 2 లక్షల కోట్ల విలువైన వజ్రాల వ్యాపారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ అందుబాటులోకి వస్తే ఏటా రూ. 4 లక్షల కోట్లకు బిజినెస్ పెరుగుతుందని అంచనా.