
గుజరాత్ : ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్.మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవలే హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. తల్లి మరణంపై నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. నిండు నూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరారని మోడీ భావోద్వేగానికి గురయ్యారు.
అస్వస్థతకు గురైన హీరాబెన్ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆస్పత్రి వర్గాలు గురువారం రాత్రే ప్రకటించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ బుధవారం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్దే ఉన్నారు. ఆ తర్వాత ఢీల్లికి వెళ్లారు.
హీరాబెన్ ను ఒకటి, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి పంపిస్తారని బీజేపీ నేతలు భావించారు. అయితే.. హఠాత్తుగా ఆమె మరణించారన్న వార్త మోడీని తీవ్ర విషాదంలో నెట్టింది. హీరాబెన్ మృతి పట్ల పలువురు బీజేపీ నాయకులు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ మోడీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. హీరాబెన్ మృతిపై దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఈ ఏడాది జూన్ లో హీరాబెన్ శత వసంతంలోకి అడుగుపెట్టారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు. పోలింగ్ కు ముందు మోడీ తన తల్లిని కలిసి ఆమెతో కొంత సమయం గడిపారు. తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
మాతృమూర్తి మరణంపై ప్రధాని భావోద్వేగ ట్వీట్
తన మాతృమూర్తి హీరాబెన్ కన్నుమూతపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘‘నా తల్లి వందేళ్ల జీవితాన్ని పూర్తి చేసుకుని దేవుడి చెంతకు చేరారు. ఆమె జీవిత ప్రయాణం ఓ తపస్సులాంటిది. సన్యాసిలా, కర్మయోగిలా, విలువలకు కట్టుబడిన వ్యక్తిలా నిస్వార్థ జీవితాన్ని గడిపారు. ఆమెలో త్రిమూర్తులు ఉన్నట్లు భావిస్తున్నా’’ అని ప్రధాని మోడీ ట్విటర్‌లో తెలిపారు.
తల్లి పాడె మోసిన ప్రధాని మోడీ
గుజరాత్లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మోడీ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించిన మోడీ..తల్లి అంతిమయాత్రలో పాల్గొన్నారు. తల్లి పాడె మోశారు. తల్లి మృతదేహం చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ప్రోటోకాల్ పక్కన పెట్టి అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. వాహనంలో ఎక్కి కూర్చున్నారు. గాంధీనగర్‌లో హీరాబెన్ భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
గవర్నర్ సంతాపం
మోడీ తల్లి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. తల్లి మరణవార్తను తట్టుకునే శక్తిని మోడీకి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలిపారు.
సీఎం కేసీఆర్ సంతాపం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
తెలంగాణ మంత్రుల సంతాపం
హీరాబెన్ మృతిపట్ల శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సంతాపం తెలిపారు.
వెంకయ్య నాయుడు సంతాపం
హీరాబెన్ మృతి పట్ల మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తల్లి..బిడ్డ మధ్య ఉండే ప్రేమ తనకు తెలుసని, ఈ విషాద సమయంలో మోడీ ధైర్యంగా ఉండాలని కోరారు.
బండి సంజయ్ సంతాపం
హీరాబెన్ మరణ వార్త తమను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హీరాబెన్ మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
డాక్టర్ లక్ష్మణ్ సంతాపం
హీరాబెన్ మృతివార్త తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హీరాబెన్ మృతి పట్ల ఆమె కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
వైఎస్ షర్మిల సంతాపం
ప్రధాని మోడీ మాతృమూర్తి హీరాబెన్ మరణం పట్ల YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంతాపం ప్రకటించారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. హీరాబెన్ విలువలతో కూడిన ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడిపారని తెలిపారు. తల్లి మరణం మోడీకి తీరని లోటని షర్మిల అన్నారు.
ప్రియాంక గాంధీ సంతాపం
ప్రధాన మంత్రి మోడీ తల్లి మృతి చెందారన్న విషాద వార్త విని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ దిగ్ర్భాంతి చెందారు. భగవంతుని పవిత్ర పాదాల చెంతకు ఆమె ఆత్మ సేదతీరుతుందని ఆకాంక్షించారు. ఈ బాధాకరమైన క్షణాలల్లో ప్రధాని మోడీకి, ఆయన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.
హీరాబెన్ మృతి బాధాకరం
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ మృతి పట్ల సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. హీరాబెన్ గొప్ప నాయకున్ని దేశానికి అందించిందన్నారు. ‘హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నాను’ అని ప్రకటించారు.
హీరాబెన్ కు తుది వీడ్కోలు
ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు గాంధీనగర్ సెక్టార్ 30లోని శ్మశాన వాటికలో ముగిశాయి. కుటుంబసభ్యుల సమక్షంలో వారి సంప్రదాయం ప్రకారం హీరాబెన్ కు తుది వీడ్కోలు పలికారు. మోడీతో పాటు ఆయన సోదరులు కూడా హీరాబెన్ చితికి నిప్పంటించారు. బతికి ఉన్నంతకాలం హీరాబెన్ అత్యంత సాధారణమైన జీవితాన్ని గడిపారు. తన కుమారుడు ప్రధాని అయినప్పటికీ.. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఉండేవారు. ఇప్పుడే అంతే నిరాడంబరంగా ఆమె అంత్యక్రియలు కూడా జరిగాయి. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం.