దేశ ప్రజలు త్యాగాలు చేయాల్సిందే.. సవాళ్లు ఎదుర్కోవాలి

 దేశ ప్రజలు త్యాగాలు చేయాల్సిందే.. సవాళ్లు ఎదుర్కోవాలి

తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో ప్రధాని రణిల్ విక్రమసింఘే జాతిని ఉద్దేశించి వివరించారు. దేశంలో పెట్రోల్ నిల్వలు అడుగంటిపోయాయని, కేవలం ఒక్కరోజుకు మాత్రమే చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. కొలంబో హార్బర్ బయట మూడు షిప్పుల్లో ఆయిల్ ఉందని, కానీ, డాలర్లు చెల్లించే స్థోమత ప్రభుత్వం దగ్గర లేదన్నారు. 

దేశంలో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు విక్రమసింఘే కొన్ని పరిష్కార మార్గాలను ప్రస్తావించారు. రానున్న రెండు నెలలు ప్రజా జీవనం దృష్ట్యా ఎంతో కీలకమని, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని, సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవాలను దాచిపెట్టే ఉద్దేశం తనకు లేదని, అబద్దాలతో దేశ ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి లేదన్నారు. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామన్నారు. రాబోయే నెలల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 

త్వరలోనే దేశ వార్షిక బడ్జెట్ ను ఉపశమన బడ్జెట్ తో భర్తీ చేస్తామని చెప్పారు. తన ఈ ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తినో, గ్రూప్ నో, కుటుంబాన్నో కాపాడడం కోసం కాదని, సమస్యలతో సతమతమవుతున్న శ్రీలంకను గట్టెక్కించడమే తన లక్ష్యమని ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పారు. గత ప్రభుత్వం రూ.2.3 ట్రిలియన్లు మేర బడ్జెట్ ఆదాయాన్ని ఆశించినా, వాస్తవానికి రూ.1.6 ట్రిలియన్లు (శ్రీలంక రూపాయలు) ఆదాయం మాత్రమే లభించిందన్నారు. దేశంలో గ్యాస్ దిగుమతి కోసం 5 మిలియన్ డాలర్ల మేర నిధులు సమకూర్చుకునేందుకు దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోందన్నారు. 

దేశంలో 14 రకాల ముఖ్యమైన ఔషధాలకు కొరత ఉందని, మందుల కొనుగోలు కోసం అత్యవసరంగా చెల్లింపులు చేయాల్సి ఉందని చెప్పారు. తీవ్ర నష్టాల్లో నడుస్తున్న శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఇకపై 15 గంటల పాటు విద్యుత్ కోతలు తప్పనిసరని అన్నారు. ఇటీవల మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేయగా, రణిల్ విక్రమసింఘే కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం..

కరీంనగర్ అదనపు కలెక్టర్ కు టీఆర్ఎస్ కార్పొరేటర్ ఫిర్యాదు

నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా.. నా కన్నా కేసీఆర్ పెద్దనటుడు